ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం ఏళ్లుగా పోరాడుతోన్న వేర్పాటువాదులు ఇటీవల దూకుడు పెంచారు.సిక్కు వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ ఇటీవల కెనడాలో రెఫరెండం నిర్వహించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
కొంతకాలం మౌనంగా వున్న ఖలిస్తానీ గ్రూపులు.ఇటీవల యాక్టీవ్ అవుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి, దాని గోడలపై భారత్‌కు వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాశారు.అక్కడితో ఆగకుండా ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా నానా రచ్చ చేశారు.
బందీ చోర్ దివాస్ సందర్భంగా ఖలిస్తాన్ మద్ధతుదారులు బ్రాంప్టన్, మిస్సిస్సాగా తదితర నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.విషయం తెలుసుకున్న ఇండో కెనడియన్లు కూడా భారత్‌కు అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.తాజాగా హిందూ సంఘాల ప్రముఖులు బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్‌ను కలిశారు.
నగరం నలుమాలలా హిందువులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించాలని వారు మేయర్‌ను కోరారు.సిక్కు శిశువులను హిందూ అల్లరి మూకలు సజీవ దహనం చేశారంటూ కొన్ని చోట్ల అసత్య ప్రచారం చేస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మేయర్ బ్రౌన్‌ను కలిసిన వారిలో నలుగురు ఫెడరల్ పార్లమెంటేరియన్లు, ముగ్గురు ప్రావిన్షియల్ పార్లమెంటేరియన్లు, ఇద్దరు సిటీ కౌన్సిలర్లు వున్నారు.

అయితే ఖలిస్తాన్ కోసం కొన్ని గ్రూపులు వరుస రెఫరెండంలు నిర్వహిస్తుండటంతో భారత్ తీవ్రంగా స్పందించింది.ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను అడ్డుకోవాలని.ఈ తరహా చర్యలకు పాల్పడుతోన్న వ్యక్తులను, సమూహాలను నియంత్రించాలని భారత ప్రభుత్వం శుక్రవారం కెనడాకు విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ప్రకటన చేశారు.ఇప్పటికే భారత ప్రభుత్వ వైఖరిని రెండుసార్లు తెలియజేశామని… వారి చట్టాల ప్రకారం భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిని ఉగ్రవాదులుగా గుర్తించాలని ఆయన కోరారు.







