మునుగోడు అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలుపడ్డాయి.సర్వే సంస్థలు అంచనా వేసినట్లు గానే టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో సాధించారు.
టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చిన బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరకు ఓటమి చెందారు.కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీకి ,పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు.
బిజెపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.మునుగోడు నియోజకవర్గం పై గట్టుపట్టు ఉండడంతో తప్పకుండా తానే గెలుస్తానని టిఆర్ఎస్ ప్రభుత్వంపై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని కేంద్రంలో బిజెపి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తన చరిష్మా ఇవన్నీ గట్టెక్కిస్తాయని రాజగోపాల్ రెడ్డి అంచనా వేశారు.
కానీ అవన్నీ బోల్తా పడ్డాయి.కాంగ్రెస్ లోనే ఉంటూ తన విజయం కోసం గట్టిగా కృషి చేసిన భువనగిరి ఎంపీ , తన సోదరుడు వెంకటరెడ్డి ఎంతగా తన విజయం కోసం ప్రయత్నించినా ఓటమి చవి చూడాల్సి రావడం రాజగోపాల్ రెడ్డికి మరింత బాధను కలిగిస్తోంది.
ఈ ఎన్నికల్లో ఓటమితో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయానికి బీటలు పడినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రాబోతోంది.
కాంగ్రెస్ భవనగిరి ఎంపీగా ఉన్న వెంకటరెడ్డి బిజెపిలోకి వెళ్లిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేశారు.కాంగ్రెస్ లో ఉన్న మునుగోడు నియోజకవర్గంలోని కీలక నేతలు అందరికీ ఫోన్ చేసి మరి, తన సోదరుడు విజయానికి కృషి చేయాలని వెంకట్ రెడ్డి కోరడం, దానికి సంబంధించిన ఆడియోలు బయటికి రావడం, సొంత పార్టీలోనే వెంకట్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి నెలకొనడం, చివరకు కాంగ్రెస్ అధిష్టానం వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసులు రెండుసార్లు జారీ చేయడం వంటివి జరిగాయి.
ఇప్పుడు వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగినా ఆయనను ఎవరు నమ్మే పరిస్థితి లేదు.తప్పకుండా వెంకటరెడ్డి పై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇక రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో ఓటమి చెందడంతో, రానున్న రోజుల్లో బిజెపిలో ఆయనకు అంతగా ప్రాధాన్యం దక్కే అవకాశం కనిపించడం లేదు.అదీ కాకుండా తన ఓటమికి కారణం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కారణమంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన రానున్న రోజుల్లో రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందులు తెచ్చే అవకాశం కనిపిస్తుంది.కేవలం 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే బిజెపిలో రాజగోపాల్ రెడ్డి చేరారనే ప్రచారం జనాల్లోకి బాగానే వెళ్ళింది.అలాగే ఇటీవల మోయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వీడియో బయటకు రావడం ఇవన్నీ ప్రభావం చూపించాయి.
ఇప్పటి వరకు నల్గొండ రాజకీయాల్లో తమకు తిరుగులేదని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఈ ఎన్నికలు కోలుకోలేని దెబ్బ తగిలేలా చేశాయి.రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పక్కన పెడితే, వెంకటరెడ్డికి రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పుడున్న కాంగ్రెస్ కు ఆయనకు ఎటువంటి ప్రాధాన్యం ఉండదు.భవిష్యత్తులోనూ ఆయనను నమ్మే పరిస్థితి లేదు.ఇప్పుడు పార్టీ చర్యలు తీసుకున్నా.తీసుకోకపోయినా వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగినా వేరే పార్టీలోకి వెళ్లినా అక్కడ ఆయనకు అంతగా ప్రాధాన్యం దక్కకపోగా, ఆయన వ్యవహారంపై మరిన్ని అనుమానాలు కలగడంతో పాటు, ఆయన ను ఎవరు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.
మొత్తంగా మునుగోడులో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమి చెందడంతో కాంగ్రెస్ లో ఉన్న వెంకటరెడ్డి కీ ఇబ్బందులు తెచ్చిపట్టినట్టే.మొత్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ శక్తి ఇబ్బందుల్లో పడినట్టే.