యాదాద్రి భువనగిరి జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అధికార టిఆర్ఎస్,బిజెపి పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి దొడ్డి దారిన ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేశాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు దా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జయశ్రీ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసి బిడ్డను ఓడించేందుకు అన్ని ఆధిపత్య పార్టీలు ఏకమయ్యాయని,ఈవిఎంలలో ఏనుగు గుర్తు కలర్ ఫుల్ గా కనబడకుండా కుట్రలు చేశారని ఆరోపించారు.మునుగోడులో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తూ రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించిందన్నారు.ఎన్నికల్లో రు.170 కోట్ల మద్యం పంచారని,వందలకోట్ల డబ్బు పంచారని,ప్రజలు బహిరంగంగా ఓటుకు ఐదు వేలు పంచుతున్నారని చెబుతుంటే,కుటుంబానికి 45 వేలు పంచినట్లు కథనాలు వచ్చినా ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.ఎన్నికల నియమావళి ప్రకారం స్థానికేతరులు వెళ్లాలని తెలిపినా,టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు మాత్రం ఇక్కడే ఉండి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదన్నారు.ఓట్ల రోజు కూడా టిఆర్ఎస్,బిజెపి పార్టీ నాయకులు రోడ్ల మీద ప్రచారం చేశారని,పార్టీ కండువాలు కప్పుకొని ఎన్నికల బూతుల వద్ద కూర్చున్నారని ఆయన గుర్తుచేశారు.
బిఎస్పి పార్టీని బలహీనపరిచేందుకు,తమకు దక్కే ఓట్లను చీల్చేందుకు డిఎస్పి, టి ఎమ్మార్పిఎస్ వంటి ముసుగు సంస్థలను పెట్టి ఏనుగుకు ఓటేయద్దని ప్రచారం చేయించారన్నారు.బిఎస్పి కార్యకర్తలను, ఏజెంట్లను అడుగడుగునా అడ్డుకున్నారని,బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడు ప్రజలు ఏ ఫలితం ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తామన్నారు.ఈ సమావేశంలో బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకరాచారి,జిల్లా అధ్యక్షలు పూదరి సైదులు,రాష్ట్ర మహిళా నాయకురాలు నర్ర నిర్మల తదితరులు పాల్గొన్నారు.







