పూజలకు , పండుగలకు పెట్టింది పేరు భారతదేశం.మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఏదో ఒక శాస్త్రీయ కారణం, పురాణ గాథ కచ్చితంగా వుంటుంది.
భారతీయుల కారణంగా వివిధ దేశాల్లోనూ మన పండుగలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇటీవలే దీపావళి వేడుకలను భారత్‌తో పాటు అన్ని దేశాల్లోనూ జరుపుకున్నారు.
తాజాగా ‘‘ఛట్ పూజ’’ను ఘనంగా జరుపుకున్నారు భారతీయులు.దివాళి పూర్తయిన ఆరు రోజుల తర్వాత జరుపుకునేదే ‘‘ఛట్ పూజ’’ .ఏటా కార్తీక మాసం శుక్లపక్షంలోని షష్టి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ పూజలు చేస్తారు.బీహార్, ఝార్ఖండ్ సహా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ‘‘ఛట్ పూజ’’ను నిర్వహిస్తారు.నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగలో .36 గంటల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారు.సూర్య భగవానుడి పేరిట జరిగే ఈ పూజలకు సూర్యశస్తిల్, దళాఛట్ అని కూడా పేర్లు వున్నాయి.నదీ తీరాల వద్ద పండ్లతో అలంకరించి, అనంతరం పండ్లను పంచిపెడతారు.ఈ ‘‘ఛట్ పూజ’’ పండుగను ఆదివారం నాడు అమెరికా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.అమెరికా అంతటా నదీ తీరాలు, సరస్సులు, తాత్కాలిక నీటి వనరుల వద్ద సూర్య భగవానుని ఆరాధించారు.
కాలిఫోర్నియా, ఆరిజోనా, కనెక్టికట్, మసాచుసెట్స్, న్యూజెర్సీ, టెక్సాస్, నార్త్ కరోలినా, వాషింగ్టన్ డీసీ వంటి భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన రాష్ట్రాల్లో ‘‘ఛట్ పూజ’’ను ఘనంగా జరుపుకున్నారు.బీహార్ జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (బీజేఏఎన్ఏ) ఆధ్వర్యంలో థాంప్సన్ పార్క్, మన్రో, న్యూజెర్సీలలో ఛట్ పూజను నిర్వహించారు.
న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో 1,500 మంది పాల్గొన్నారు.బీజేఏఎన్ఏ ఐదేళ్ల క్రితం నుంచి కమ్యూనిటి ఛట్ పూజను నిర్వహించడం ప్రారంభించింది.

ఇక న్యూజెర్సీలో జరిగిన ఛట్ పూజ కార్యక్రమంలో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో మూలాలను కలిగి వున్న మన సోదరులు ఛట్ పండుగను గౌరవప్రదంగా, సాంప్రదాయకంగా జరుపుకోవడం సంతోషంగా వుందన్నారు.అమెరికాలో జరిగిన ఈ వేడుకలో తాను భాగమైనందుకు ఆనందంగా వుందని మస్తాన్ అన్నారు.







