సూర్యాపేట జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో, మండల కేంద్రాల్లో వైద్యాధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించారు.
ఆ తనిఖీల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.వారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావడం పట్ల విమర్శలు రావడంతో ఆ ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లపై జిల్లా వైద్యాధికారి కోటా చలం సస్పెన్షన్ వేటు వేశారు.
సస్పెన్షన్ అయిన తర్వాత సంబంధిత వైద్యులు విధి నిర్వహణ ప్రదేశంలో ఉండాలి తప్ప వేరే చోట వెళ్లి వైద్యం చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చారు.కానీ,సస్పెండ్ అయిన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ సస్పెన్షన్ విధివిధానాలు పాటించకుండా తిరిగి సూర్యాపేట ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రత్యక్షం కావడం గమనార్హం.
గత సంవత్సరం నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యం చేస్తూ కేతేపల్లి మండల ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండడంతో ఆయనపై అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి.సస్పెన్షన్ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ కేతేపల్లి మెడికల్ ఆఫీసర్ విజయ్ కుమార్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేస్తూ తిరుగుతున్నా కూడా జిల్లా వైద్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికైనా ప్రభుత్వ డాక్టర్ విజయ్ కుమార్ పై చర్య తీసుకొని,వైద్య,ఆరోగ్య శాఖలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.