తెలంగాణ ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.బస్సులు నడపకపోతే రోజుకు రూ.4 కోట్లు.నడిపితే రూ.7-8 కోట్లకు పైగా నష్టపోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.సుమారు రూ.70వేల కోట్లకుపైగా ఆస్తులు ఉన్న ఆర్టీసీ 45 వేల మంది ఉద్యోగులకు సుమారు ఏడేళ్లుగా ఎలాంటి ఆర్థికపరమైన ప్రయోజనాలను అందించలేదు.రోజూవారీ అవసరాల కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకువస్తోంది.
ఏడేళ్లుగా వేతనాలు పెరగకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.సీసీఎ్‌సలో దాచుకున్న నిధుల నుంచి అడ్వాన్‌సలు ఇప్పించాలని రెండు నెలలుగా డ్రైవర్లు, కండక్టర్లు చేసుకున్న దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా రావడం వారి ఆర్థిక పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటి వరకు సీసీఎ్‌సకు సుమారు రూ.750కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.
మూడేళ్లుగా సీసీఎ్‌సకు బకాయి పడిన నిధులను విడుదల చేయాలని ఉద్యోగులు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.దీంతో లోన్ అడ్వాన్‌స కింద దరఖాస్తు చేసి మూడేళ్లుగా నిరీక్షించిన ఉద్యోగులకు సీసీఎస్ పరిమితంగా నిధులు విడుదల చేసింది.
మరోవైపు, తమకు లోన్ అడ్వాన్‌సలు అందించాలని వందలాది మంది ఉద్యోగులు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు పంపడంతో ఏంచేయాలో తోచక సీసీఎస్ అధికారులు అయోమయంలో ఉన్నారు.ఉద్యోగుల నుంచి మినహాయించిన వేతనాల్లో సుమారు రూ.25 కోట్ల వరకు ఆర్టీసీ యాజమాన్యం సీసీఎ్‌సకు చెల్లించవలిసి ఉంది.కానీ, నిధులను సర్దుబాటు చేయడం వరకు పరిమితమవుతోంది తప్ప, నెల నెలా చెల్లించడం లేదని తెలిసింది.

ఇదిలా ఉండగా గడిచిన 10 నెలల కాలంలో ఆర్టీసీ సుమారు రూ.1,787కోట్లకు పైగా నష్టపోయినట్టు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.నెలకు ఆర్టీసీకి దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.270 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది.నిర్వహణకు సుమారు రూ.350 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.బస్ పాస్‌లు ఇతర రీయింబర్‌సమెంట్ నిధులు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో ఆర్టీసీ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని నిర్వహణకు సర్దుబాటు చేస్తోంది.
దీంతో ఆర్టీసీపై అప్పుల భారం పెరుగుతోంది.టిక్కెట్ చార్జీల పెంపుతో ఏటా సుమారు రూ.750కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని ఆశించినప్పటికీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో చార్జీలను పెంచలేకపోయారు.

టిక్కెటేతర ఆదాయం గతంలో నెలకు సుమారు రూ.25 కోట్ల వరకు వస్తున్నప్పటికీ కరోనా వల్ల రెండేళ్లుగా గణనీయంగా తగ్గిపోయినట్టు అధికారులు తెలిపారు.ప్రతి నెలా ఉద్యోగుల జీత భత్యాలకు సుమారు రూ.160 కోట్ల నుంచి రూ.170 కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు.డీజిల్ తదితర అవసరాలకు సుమారు రూ.90 కోట్ల నుంచి రూ.105 కోట్ల వ్యయమవుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.పూర్తి స్థాయిలో బస్సులు నడిచిన పక్షంలో డీజిల్ వ్యయం మరో రూ.పది కోట్ల వరకు పెరుగుతుంది.బస్సుల విడి భాగాలు, టైర్లు తదితర అవసరాలకు సుమారు రూ.20 కోట్ల నుంచి రూ.30కోట్ల వరకు వ్యయమవుతున్నట్టు తెలిసింది.







