ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే.మినీ బడ్జెట్ విఫలమవ్వడంతో పాటు దేశంలో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, పరిపాలనలో విఫలమవ్వడం వంటి కారణాలతో లిజ్ ట్రస్‌పై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో చేసేది లేక ఆమె ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.ఈ నేపథ్యంలో యూకేలో రెండు నెలలు తిరక్కుండానే మరోసారి ప్రధాని ఎన్నిక అనివార్యమైంది.
ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీలో చోటు చేసుకున్న పరిస్ధితులపై ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని లేబర్ పార్టీకి చెందిన భారత సంతతి ఎంపీలు కోరుతున్నారు.
ప్రస్తుతం దేశంలోని సంక్షోభాన్ని ఎన్నికల ద్వారానే పరిష్కరించగలమని వారు అభిప్రాయపడుతున్నారు.
దేశంలోని పరిస్ధితులపై బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ వరుస ట్వీట్లు చేశారు.
కైర్ స్టార్మర్ ప్రధాని అయితే లేబర్ ప్రభుత్వం బ్రిటన్‌కు స్థిరత్వాన్ని, బలమైన నాయకత్వాన్ని అందిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.నాటింగ్‌హామ్ ఈస్ట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ నదియా విట్టోమ్ స్పందిస్తూ… లిజ్ ట్రస్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
ఇప్పటికే వినాశకరమైన జీవన వ్యయ సంక్షోభం సమయంలో, ధనికులకు పెద్దపీట వేయడం ద్వారా ఆర్ధిక వ్యవస్థను క్రాష్ చేసిన వ్యక్తిగా.లిజ్ ట్రస్‌ను అధికారంలోకి తెచ్చిన ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహిస్తారని నదియా ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షం నుంచి ఈ స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడానికి కారణం కన్జర్వేటివ్‌ల స్వయంకృతమే.2016లో బ్రెగ్జిట్ నుంచి నేటి వరకు పలువురు ప్రధాన మంత్రులు మారారు.థెరిస్సా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్‌లు పరిపాలనా బాధ్యతలు చూశారు.వీరిలో జాన్సన్ సమర్ధవంతంగా వ్యవహరించినప్పటికీ.కరోనా మహమ్మారి, పార్టీ గేట్ వివాదం కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.లిజ్ ట్రస్ గురించి ఇక సరేసరి.
ఇప్పుడు ఆమె వారసుడిగా వచ్చే వ్యక్తి ఎలాంటి పనితీరు కనబరుస్తారో చూడాలి.

ఒపీనియన్ పోల్స్ ప్రకారం.ముందస్తు ఎన్నికలు జరిగితే దాదాపు 12 ఏళ్ల నుంచి అధికారంలో వున్న కన్జర్వేటివ్‌లు తుడిచిపెట్టుకుని పోతారని సర్వేలు చెబుతున్నాయి.అక్టోబర్ 21 నాటి సర్వే ఫలితాల ప్రకారం.
లేబర్ పార్టీ 54 శాతం ఓట్లు సాధిస్తుందని, అదే సమయంలో టోరీలకు ప్రజల మద్ధతు 33 శాతం నుంచి 21 శాతానికి పడిపోయింది.అటు దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని 6,49,000 మందికి పైగా ప్రజలు పార్లమెంట్‌కు పంపిన ఓ పిటిషన్‌లో సంతకాలు చేశారు.
అయితే షెడ్యూల్ ప్రకారం.యూకేలో తదుపరి సాధారణ ఎన్నికలు మే 2024లో జరగనున్నాయి.
ఫిక్స్‌డ్ టర్మ్ పార్లమెంట్ చట్టం 2011 ప్రకారం.ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి.







