తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.రాజకీయ నేతలు పార్టీల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
జంపు జలానీలుగా మారుతున్నారు.ఉద్యమ పార్టీ అని ఒకరు, తెలంగాణ ఇచ్చామని మరొకరు, సహకరించామని ఇంకొకరు ఈ విధంగా ప్రకటన చేస్తూ రాజకీయ పార్టీలు పబ్బం కడుపుకుంటుండగా నాయకులు మాత్రం ఎప్పుడు ఏం పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది.
దీంతో ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితిలో గతంలో ఇతర రాజకీయ పార్టీల నుండి రాజకీయ నేతలు చేరేవారు.2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీల నుండి నాయకులు టిఆర్ఎస్ లో చేరారు.అంతేగాక కొందరు యువ రక్తంతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరగా ఎంతో మంది ఉద్యమకారుల సైతం తెలంగాణ రాష్ట్ర సమితికి బాసటనందించి అండగా నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ తమది ఫక్తు రాజకీయ పార్టీ అంటూ ప్రకటన చేశారు.దీంతో ఇతర రాజకీయ పార్టీ నేతలను తమ పార్టీలో ఎలా కలుపుకోవాలి అన్న వహాత్మక రాజకీయాలకు తెర లేపారు.
ఆ వ్యూహంలో భాగంగా ఎంతో మంది ఇతర పార్టీ నేతలను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకోవడంతో ఇంటింతై వటుడింతై తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన పార్టీగా ఆవిర్భవించింది.దీంతో 2014 వ సంవత్సరంలో అధికారంలోకి రావడంతో ఉద్యమకారులు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడంతో తిరుగులేని శక్తిగా నిలిచింది.
2014 ఎన్నికల్లో గెలుపొందిన ఇతర పార్టీ నేతలను తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీలోకి విలీనం చేసుకుంది.అంతేగాక టిఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి రావడంతో సైతం కాంగ్రెస్ పార్టీ, టిడిపి నుండి గెలుపొందిన ప్రజా ప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర సమితిలోకి తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ఎజెండా గా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి నేడు పక్కా రాజకీయ పార్టీగా అని చెప్పాలి.ఎంతోమంది మేధావులు కన్న ఈ భారత దేశంలో విలువలు లేని రాజకీయాలు కొనసాగుతున్నాయి.
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఎందరో త్యాగదనులు అదే రాజకీయ పార్టీలో పుట్టి అదే పార్టీలో చచ్చేంత వరకు కొనసాగిన నేపథ్యం కనుమరుగవుతుంది.పూటకో పార్టీ, రోజుకో జెండా అన్న విధంగా రాజకీయ నేతలు పార్టీలు మారుతూ సమాజానికి మాయని మచ్చగా మిగిలిపోతున్నారు.
భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీ అందుకేనేమో రాజకీయ పదవి ఆలంకరించలేదు.నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓ పుచ్చలపల్లి సుందరయ్య, ఓ ఎన్ జి రంగా, ఓ కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న, గుమ్మడి నర్సయ్య లాంటి గొప్ప నేతలు మనకు ఆదర్శ నాయకులైనప్పటికీ ఈ మధ్య రాజకీయ పార్టీ నేతల తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోంది.
రాజకీయ పదవి అంటే కేవలం అధికార పదవే కాదని సేవా తత్పరత సహాయం చేసే గుణం అది మహోన్నత మానవతా మూర్తి రాజకీయ నేత లక్షణం అయితే నేడు కేవలం రాజకీయ నాయకులు అంటే అధికార పార్టీ అని పదవి ఉంటేనే రాజకీయ నాయకుడనే భావాన్ని ఒంట పట్టించుకున్నారేమో అందుకే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు కాంగ్రెస్ నుంచి బిజెపికి బిజెపి నుండి టిఆర్ఎస్ కు ప్రదక్షిణ చేసిన విధంగా రాజకీయ పార్టీలు రోజుకో పార్టీ మారుతూ ప్రజలకు కంపరం పుట్టిస్తున్నారు.దీంతో విలువైన రాజకీయాలు చూసిన సీనియర్ సిటిజన్ లు సైతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ నేతల పార్టీ మార్పులను చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీని వీడి అట్లు చేరారు.ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవి తోపాటు శాసనమండలి చైర్మన్ పదవి బాధ్యత చేపట్టిన స్వామి గౌడ్ టిఆర్ఎస్ ను వదిలి భారతీయ జనతా పార్టీలో చేరారు.టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లిన దాసోజు శ్రవణ్ భారతీయ జనతా పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పదవి చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరారు.
జర్నలిస్టు సంఘం నాయకునిగా పనిచేసిన పల్లె రవికుమార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ లో చేరారు.అక్కడ తనకు న్యాయం జరగలేదన్న నిరాశతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజాగా ఈ నాయకులందరూ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ఆయా పార్టీలలో సామాజిక న్యాయం జరగలేదని ఒకరు, పార్టీలు పెట్టుబడిదారుల పట్టుకొమ్మలని మరొకరు విమర్శలు చేస్తూ దుమ్మెత్తి పోశారు.తాజాగా ఈ నాయకులందరూ వారు చేరిన పార్టీలను విమర్శిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆత్మగౌరవం లేదని తాను ఆ పార్టీలో ఉండలేనని విమర్శిస్తూ ఆయన టిఆర్ఎస్ కు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ పకడ్బందీ వ్యూహంతో ఎలాగైనా పాత మిత్రులను టిఆర్ఎస్ గూటికి తీసుకు రావాలని చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం అయింది.పార్టీలో చేర్పించుకున్నవారికి సంతోషం, చేరిన వారికి మహానందంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగింది మాత్రం శూన్యం.
ప్రజల పక్షంగా ప్రతిపక్షంగా పోరాడుతారని నమ్మిన ప్రజలకు మాత్రం సిద్ధాంతాలు గాలికి వదిలేసి స్వార్థం కోసం పార్టీలు మారుతున్న రాజకీయ నేతలకు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతామని అసలు సిసలైన కార్యకర్తలు ఆలోచిస్తున్నారని మేధావి వర్గాల అభిప్రాయం.