భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త, సామాజిక వేత్త స్వదేశ్ ఛటర్జీని అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం తన అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.గడిచిన మూడు దశాబ్ధాలుగా ఇండో – యూఎస్ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఛటర్జీ ఎంతో కృషి చేశారు.
ఈ సేవలకు గుర్తింపుగా ‘‘ఆర్డర్ ఆఫ్ ది లాంగ్ లీఫ్ పైన్’’ అవార్డుకు స్వదేశ్‌ను ఎంపిక చేశారు.శుక్రవారం క్యారీ నగరంలో జరిగిన వేడుకల్లో నార్త్ కరోలినా గవర్నర్ రే కూపర్ ఛటర్జీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఛటర్జీ చేసిన కృషిని గవర్నర్ ప్రశంసించారు.
2001లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న ఛటర్జీ… ఇండో- యూఎస్ ప్రభుత్వాలను మరింత దగ్గరకు చేర్చే కీలక ఘట్టాలకు కేంద్రంగా నిలిచారని భారత్‌లో అమెరికా మాజీ రాయబారి రిచ్ వర్మ కొనియాడారు.2000వ సంవత్సరం నుంచి భారత్- అమెరికా సంబంధాలు కొత్త మలుపు తిరిగాయని ఆయన అన్నారు.భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునే నిమిత్తం 2000వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భారత పర్యటనలోనూ స్వదేశ్ ముఖ్య భూమిక పోషించారని రిచ్ వర్మ చెప్పారు.
నాడు అమెరికా అధ్యక్షుడి వెంటే వుంటూ పర్యటన విజయవంతం కావడానికి ఛటర్జీ ఎంతో కృషి చేశారని ఆయన ప్రశంసించారు.ఇండో – యూఎస్ పౌర అణు ఒప్పందంలోనూ ఛటర్జీ కీలకపాత్ర పోషించారని… ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడం వెనుకా కృషి చేశారని రిచ్ వర్మ గుర్తుచేశారు.

భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా మాట్లాడుతూ… ఛటర్జీని ఇండో అమెరికన్ కమ్యూనిటీకి గొప్ప నాయకుడిగా అభివర్ణించారు.అమెరికన్ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించిన తొలి తరం ప్రవాస భారతీయుల్లో ఛటర్జీ ఒకరని ఖన్నా గుర్తుచేశారు.అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు కూడా ఓ వీడియో సందేశం ద్వారా ఛటర్జీ గొప్పతనాన్ని కొనియాడారు.







