నల్లగొండ జిల్లా:మునుగోడులో ప్రజలు ఓటు వేయడం ఎందుకు?ఏ పార్టీ పైసలు ఎక్కువ పంచితే ఆ పార్టీని గెలిచినట్లు ప్రకటిస్తే సరిపోతుంది కదా అని సామాజిక కార్యకర్త నారగొని ప్రవీణ్ కుమార్ అన్నారు.మునుగోడు జరుగుతున్న ఉప ఎన్నికల తతంగంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
నిఘాసంస్థలు పూర్తిగా విఫలం కావడంతో మునుగోడులో పట్టపగలే ప్రజాస్వామ్యం నడిబజారులో ఖూనీ అవుతుందన్నారు.వందల కోట్ లరూపాయలు, వందల కోట్ల విలువైన మద్యం మునుగోడులో వరదలై పారుతుంటే కట్టడి చేయాల్సిన యంత్రాగం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదన్నారు.
రాజకీయ పార్టీలు విలువలకు వలువలు విప్పి,నడి బజారులో నిలబెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థకు పాతర పెడుతుంటే ప్రజాస్వామ్య పరిరక్షణ చేసే వారెవ్వరని ప్రశ్నించారు.ప్రజల సొమ్ము దోచుకున్న దొంగలు మళ్ళీ గెలవడానికి అందులో నుంచి కొంత ఖర్చు పెడతారని,మరింత దోచుకోడానికి సీటును ఎక్కుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా మునుగోడులో తాగే మద్యాన్ని ఒక చెరువులో పోస్తే చెరువు పూర్తిగా నిండుతుందని,మునుగోడు మద్యం షాపుల్లోనే ఇప్పుడు పంచుతున్న మద్యం కొంటూ ఉంటే ఈ మూడు నెలలలో దేశంలోనే రికార్డ్ స్థాయిలో అమ్ముడు పోయి ఉంటుందని పేర్కొన్నారు.ఒక కార్యకర్తకు రోజుకు కనీసం మూడు పెగ్గుల మద్యం పోస్తున్నారని,ఈ మూడు నెలలలో మునుగోడులో కొత్తగా తాగుడుకు అలవాటు పడ్డవారు పది వేల మందికి పైగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలు అయ్యేవరకు నాయకులు పోపిస్తారని,తరువాత ఇప్పుడు అలవాటు చేసుకున్న వారు సొంతంగా కొనుక్కొని తాగాల్సి వస్తుందని,అప్పుడు బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో మంటలు చెలరేగుతాయని, పాలకులకు కావాల్సింది కూడా అదేనన్న విషయం ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారోనని వాపోయారు.తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి దిగజారిపోతున్న పార్టీల నాయకులు ఆచరణ సాధ్యంకాని పథకాలు,వాగ్దానాలు ప్రకటిస్తున్నాయని, ప్రజలను మభ్య పెడుతూ గెలుపు కోసం అధికార పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయని, గెలిచాక మునుగోడుకు వరిగేదేమి ఉండదన్నారు.
ప్రధాన పార్టీలు మేధావులకు, సంఘ సేవకులకు,నిజాయితీ గల నాయకులకు పార్టీ టిక్కెట్స్ ఇవ్వకుండా అక్రమ సంపాదన చేసి వందల కోట్లు ఖర్చుపెట్టే వారికి,పాలన తెలియని వారికి టిక్కెట్స్ ఇవ్వడం వలన ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.వారు గెలిచిన తరువాత మరింత అక్రమ సంపాదన చేస్తున్నారని,ఇప్పుడు ఉన్న చాలా మంది నాయకులు అలాంటి వారేనని గుర్తు చేశారు.
ప్రజాసామ్యం వర్ధిల్లాలి అంటే ప్రజలు నిజాయితీ గల నాయకులకు,మేధావులకు, సంఘ సేవకులకు పార్టీలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించుకోవాలి పిలుపునిచ్చారు.ప్రజలు మారకపోతే పాలకుల తీరు మారదని,ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధమని దానితోనే దేశాన్ని కొల్లగొట్టే గజదొంగల భరతం పట్టాలని సూచించారు.







