నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలో దారుణం జరిగింది.గురువారం ఉదయం 4 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన గుర్రం హరికృష్ణ(30) తన భార్య గుర్రం విజయ (25)ను అత్యంత దారుణంగా తలపై రాడ్డుతో కొట్టి చంపిన ఘటన గ్రామంలో కలకలం రేగింది.
అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… గ్రామ సర్పంచ్ గుర్రం సత్యం టీఆర్ఎస్ కి చెందిన వ్యక్తి కావడం, నిందితుడు గుర్రం హరికృష్ణ పెద్ద నాన్న కొడుకు కావడంతో స్థానిక ఎంపీపీ కర్నాటి స్వామి సహాయంతో మునుగోడు ఎస్ఐ సతీష్ రెడ్డిని మేనేజ్ చేసి,కనీసం కుటుంబ సభ్యులు అక్కడికి రాకముందే,ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించకుండానే గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్లో శవాన్ని వేసుకొని,దానిని స్వయంగా ఓ కానిస్టేబుల్ తో నడుపుతూ పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ హాస్పిటల్ తరలించారు.
ఇదేమి అన్యాయమని ప్రశ్నించిన కుటుంబ సభ్యులను పోలీసులు దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ కి తరలించారు.గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్బంగా మంత్రి కేటీఆర్ వస్తుండని, ఎలాంటి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశ్యంతో పోలీసులు అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు గుట్టుచప్పుడు కాకుండా వెంటనే మృతదేహాన్ని ట్రాక్టర్ లో పోస్టుమార్టం తరలించే ప్రయత్నం చేశారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు మునుగోడులో ట్రాక్టర్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.వారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బాధితులను దౌర్జన్యంగా లాగిపడేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
నిందితుడు గుర్రం హరికృష్ణ బాబాయ్ కొడుకైన గుర్రం సత్యం అధికార టీఆర్ఎస్ పార్టీ సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు కావడంతో పోలీసులు ఈ దారుణానికి వడిగట్టారని సమాచారం.మృతదేహం నల్లగొండకు తరలించకుండా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో మునుగోడులో ఉద్రిక్త నెలకొంది.
పోలీసుల తీరును నిరసిస్తూ వారు మునుగోడులో ధర్నాకు దిగడంతో విషయం తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.నల్లగొండ డిఎస్పీ నరసింహారెడ్డితో ఫోన్లో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని,ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడు హరికృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం భార్యభర్తల మధ్య జరిగిన ఘటనలో రాజకీయ నాయకులు దూరి, పోలీసులను ఉపయోగించి పేద కుటుంబాలకు ఇలాంటి అన్యాయం చేస్తున్నారని,ఇది ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందని,టీఆర్ఎస్ నాయకులు పోలీసులను ఉపయోగించుకొని దాడులు,దౌర్జన్యాలు చేస్తున్నారని దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు.వెంటనే నిందితులను అరెస్ట్ చేసి,బాధిత కుటుంబానికి 20 లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు.
అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడాతూ ఇదే పరిస్థితి కేటీఆర్ చెల్లికి జరిగితే పోలీసులు ఇలాగే చేస్తారా అని ప్రశ్నించారు.పేద వాళ్ళమైన కారణంగా మమ్మల్ని ఇలాగ ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా అని ఆవేదన వ్యక్తంచేశారు.