శ్రీలంకకు చెందిన ఓ యువకుడు సముద్రంలో దూకి 13 కిలోమీటర్లు ఈదుకుంటూ మొత్తానికి తమిళనాడు తీరానికి చేరుకున్నాడు.అతడి సాహసానికి, గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.
కానీ, అతడు అక్రమంగా భారత్‌లో ప్రవేశించడంతో తీర గస్తీదళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి.శ్రీలంక నుంచి ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి ఓ పడవలో తమిళనాడుకు బయలుదేరాడు.
తమిళనాడు తీరానికి చేరుకునే క్రమంలో సముద్రంలో దూకేసిన 24 ఏళ్ల ఆ యువకుడు ఆ తర్వాత 13 కిలోమీటర్లు ఈది రామేశ్వరం తీరానికి చేరుకున్నాడు.అతడిని అదుపులోకి తీసుకున్న కోస్ట్ గార్డ్ అధికారులు అతడి నుంచి గడువు ముగిసిన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.
శ్రీలంకలోని తలైమన్నారుకు చెందిన హసాన్ ఖాన్ అలియాస్ అజయ్ అలియాస్ ఖాన్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి బోటులో వచ్చినట్టు గుర్తించారు.వారితో పాటు మరో వ్యక్తి కూడా వచ్చాడని, అందరినీ రామనాథపురం జిల్లా మండపం క్యాంపునకు తరలించినట్టు చెప్పారు.







