యాదాద్రి జిల్లా:పోచంపల్లి టీఎస్ మోడల్ స్కూల్/జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న నోముల ఆకాష్ రెడ్డి(17) తన వాట్సాప్ డీపీగా ఓ అమ్మాయి ఫోటో పెట్టుకున్నందుకు జూనియర్ కాలేజీ అధ్యాపకురాలు అరుంధతి మందలించిందని మనస్థాపం చెంది,తన చావుకు మ్యాథ్స్ అధ్యపకురాలు కారణమని సూసైడ్ నోట్ రాసి వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఆదివారం జిల్లాలో కలకలం రేపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన నోముల శ్రీనివాస్ రెడ్డి,అనిత దంపతులకు ఒక కుమారుడు,ఒక కూతురు.
గత పదేళ్ల క్రితం శ్రీనివాస్ రెడ్డి మరణించారు.తల్లి అనిత చేనేత మగ్గం వృత్తిపై ఆధారపడి పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తుంది.
కుమారుడు ఆకాష్ రెడ్డి పోచంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు.ఆ సమయంలో అదే కాలేజీకి చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడింది.
మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆకాష్ రెడ్డి తనకు మాథ్స్ అర్థం కావడం లేదని అతను కాలేజీ నుంచి వెళ్లి మరో కాలేజీలో చదువుకుంటానని,తనకు టీసీ ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపాల్,అధ్యాపకులపై ఒత్తిడి చేసేవాడు.విద్యార్థి కోరిక మేరకు టీసీ ఇవ్వగా పోచంపల్లి టీఎస్ మోడల్ స్కూల్/జూనియర్ కాలేజీలో వారం క్రితమే ఇంటర్ సెకండియర్‌లో చేరాడు.
అయితే అతడు తన వాట్సాప్ డీపీగా తన పాత కాలేజీ అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడు.ఈ విషయాన్ని ఆ అమ్మాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని మాథ్స్ టీచర్ అరుంధతికి చెప్పింది.
దీనితో అధ్యాపకురాలు అతనిని పిలిచి వాట్సాప్ డిపిగా ఉన్న ఫోటో తొలగించాలని హెచ్చరించినట్లు సమాచారం.అయితే ఈ విషయంలో తనపై కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి భయపడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అతను రాసిన సూసైడ్ నోట్ చూస్తే అర్ధమవుతుంది.
సూసైడ్ నోట్ లో తాను ఆ అమ్మాయిని చెల్లిగా పిలుస్తానని,తన చావుకు అధ్యాపకురాలు అరుంధతి కారణమని పేర్కొన్నాడు.తన నోట్ బుక్‌లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజుకు తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి పెట్టుకుని తన ఆవేదన వ్యక్తం చేస్తూ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆదివారం ఉదయం తన వాట్సాప్ స్టేటస్‌లోను విషాద గీతంతో తాను చనిపోతున్నానని పోస్ట్ చేసినట్లు అతని స్నేహితులు పేర్కొన్నారు.ఈ విషయంపై అనుమానంతో అతని స్నేహితులు అతని గురించి వాకబు చేయగా గ్రామ శివారులోని కందడి యాదిరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
వ్యవసాయం బావికి సమీపంలో ఒక పశువుల కాపరి ఆకాష్ రెడ్డి బావిలో దూకడం చూసి స్థానికులకు సమాచారం వచ్చాడు.దీంతో సంఘటన స్థలానికి చేరుకొన్న ఎస్ఐ సైదిరెడ్డి బావి వద్ద పరిశీలించగా అక్కడే ఆకాష్ రెడ్డి చెప్పులు,దుస్తులు ఉన్నట్లు గమనించారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.







