దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ కి ఊపు తీసుకురావడంతో పాటు , కేంద్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తమిళనాడు నుంచి భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు.
ప్రస్తుతం కేరళలో ఆ యాత్ర కొనసాగుతోంది.కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగే ఈ యాత్ర వివిధ రాష్ట్రాల మీదుగా సాగబోతోంది.
దీంట్లో తెలంగాణ కూడా ఉండడంతో రాహుల్ యాత్రపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.ఇప్పటికే తమిళనాడు , కేరళలో రాహుల్ యాత్రకు మంచి ఆదరణ లభించడంతో పాటు, అక్కడ కాంగ్రెస్ నేతల్లోనూ ఉత్సాహం పెరగడం, ప్రజలు కాంగ్రెస్ కు దగ్గరవుతూ ఉండడం వంటి విషయాలను గమనించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాహుల్ పర్యటన తర్వాత కాంగ్రెస్ కు మరింత ఆదరణ పెరుగుతుందని , త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని బలంగా నమ్ముతున్నారు.

రాహుల్ పాదయాత్ర షెడ్యూల్ ను పరిశీలిస్తే అక్టోబర్ 24 రాహుల్ కర్ణాటకలోని రాయచూర్ నియోజకవర్గంలో నుంచి తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు.హైదరాబాద్ శివారు మీదుగా మహారాష్ట్రలోకి రాహుల్ ప్రవేశిస్తారు.మొత్తం 350 కి.మీ మేర తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేయబోతుండడంతో , ఆ యాత్రను ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.రాహుల్ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు విశేష ఆదరణ లభించడంతో పాటు, కేరళ తమిళనాడులో నిర్వహించిన భారత్ జూడో యాత్రకు విశేష స్పందన రావడంతో తెలంగాణలో అంతకు మించిన స్థాయిలో రాహుల్ సభ సక్సెస్ అవుతుంది అని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నమ్మకం పెట్టుకుంటున్నారు.అందుకే రాహుల్ యాత్ర తెలంగాణలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందా అనే ఎదురుచూపులు చూస్తూ, పార్టీని మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
రాహుల్ యాత్ర సమయంలోనైనా పార్టీలో గ్రూపు రాజకీయాలు సర్దుమణిగి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వీలు అవుతుంది అనే నమ్మకంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
.






