బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వచ్చారు.ఈ సందర్భంగా సినీ హీరో నితిన్ తో ప్రత్యేకంగా నడ్డా భేటీ అయ్యారు.
అంతకుముందే కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం, ఆ తరువాత నితిన్ తో నడ్డా భేటీ కావడంతో తెలంగాణలో బిజెపి పట్టు పెంచుకునేందుకు సినీ గ్లామర్ ను ఉపయోగించుకోబోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.అంతేకాకుండా త్వరలోనే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ తతంగం అంతా జరిగి చాలా రోజులు అయింది.దీనికి సంబంధించి పొలిటికల్ గాసిప్స్ అనేకం వచ్చాయి.
అయితే నితిన్ తో నడ్డ భేటీ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు పొరబడ్డారనే విషయం ఆ పార్టీ నేతల మధ్య హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవంగా జేపీ నడ్డా కలవాలనుకున్నది హీరో నిఖిల్ ను కానీ ఆయనకు బదులుగా నితిన్ ను ఆహ్వానించారనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్యఅతిథిగా జేపీ నడ్డా హాజరయ్యారు.అయితే ఆ కార్యక్రమం ముగియకుండనే ఆయన హైదరాబాద్ నోవాటెల్ కు చేరుకున్నారు.
అక్కడ హీరో నితిన్ ను జేపి నడ్డా కలిశారు.ఆ సందర్భంగా సినిమా, పార్టీ వ్యవహారాలకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని, అవసరమైతే బిజెపి తరఫున ప్రచారానికి సిద్ధంగా ఉన్నట్లుగా నితిన్ నడ్డాకు చెప్పినట్లుగాను ప్రచారం జరిగింది.

అయితే వాస్తవంగా జేపీ నడ్డా భేటీ కావాలనుకుంది నితిన్ ను కాదని, కార్తికేయ 2 లో హీరోగా నటించిన నిఖిల్ ని అని, కార్తికేయ 2 సినిమా బాలీవుడ్ లోనూ హిట్ టాక్ తెచ్చుకోవడంతో , నిఖిల్ ను కలిసి అభినందించాలి అని జేపీ నడ్డా భావించారట.అయితే పొరపాటున నితిన్ ను పిలవాలంటూ ఆయన తెలంగాణ బిజెపి నేతలకు సూచించడంతో వారు నితిన్ ను పిలవడం తోనే ఈ వ్యవహారం అంతా చోటు చేసుకుందట.పేరు విషయంలో కన్ఫ్యూజ్ కావడంతోనే ఈ తతంగం అంత జరిగినట్లు సమాచారం.







