వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలకు భారతీయులు వెళ్తున్న సంగతి తెలిసిందే.అయితే ఎక్కడి నుంచో వచ్చి తమ అవకాశాలను లాక్కుంటున్నారనో, లేక మరేదైనా కారణమో కానీ భారతీయులు విద్వేష దాడికి గురవుతున్నారు.
ఇటీవల అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో నలుగురు భారతీయ అమెరికన్లపై జరిగిన జాత్యహంకార దాడి కలకలం రేగిన సంగతి తెలిసిందే .ఈ ఘటన మరిచిపోకముందే.అమెరికాలోనే కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో విద్వేషదాడి జరిగింది.అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే .బాధితుడు, నిందితుడు ఇద్దరూ భారతీయులే కావడం.
వివరాల్లోకి వెళితే… ఈ నెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ రోజున టాకో బెల్ అనే ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లో క్రిష్ణన్ జయరామన్ అనే వ్యక్తి తాను ఆర్డర్ చేసిన ఫుడ్ పార్శిల్ తీసుకోవడానికి వెళ్లాడు.అప్పుడు అక్కడే వున్న తజీందర్ సింగ్ అనే వ్యకి జాత్యహంకార వ్యాఖ్యలతో అసభ్యంగా దూషించాడు.
నువ్వు హిందువు కదా, గో మాత్రంతో స్నానం చేస్తావు, అసహ్యకరమైన కుక్క వంటి పదాలతో బూతులు తిట్టాడు.నీలాంటి వారి వల్లే భారతీయులు చులకన అవుతున్నారని.ఇంకప్పుడూ బయట కనిపించొద్దంటూ జయరామన్ ముఖంపై ఉమ్మి వేశాడు.తజీందర్ సింగ్ పైశాచికత్వాన్ని జయరామన్ సెల్ఫోన్లో చిత్రీకరించాడు.
ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాలిఫోర్నియా పోలీసులు స్పందించారు.ఆ వెంటనే తజీందర్ సింగ్ను అదుపులోకి తీసుకుని అతనిపై ‘హేట్ క్రైమ్’ కింద కేసు నమోదు చేశారు.
కాగా.గత వారం డల్లాస్లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఈ విద్వేష దాడి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.నాకు భారతీయులంటే అసహ్యం… అక్కడ మంచి జీవితం లేకపోవడం వల్లే మీరంతా అమెరికా వస్తున్నారు.మీ దేశానికి మీరు వెళ్లిపోండి.ఎక్కడికి వెళ్లినా మీరే కనిపిస్తున్నారంటూ ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.