టిడిపి అధినేత చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.వైసీపీ ప్రభుత్వం వరుస సంక్షేమ పథకాలతో జనాల్లోకి దూసుకు వెళ్తోంది .
వైసిపి ప్రతిపక్షంలో ఉండగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రకటించడమే కాకుండా, దాన్ని జగన్ పాదయాత్ర సమయంలో జనాల్లోకి బాగా తీసుకువెళ్లారు.దీనికి తగ్గట్లుగానే గత టిడిపి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో , జగన్ వైపు జనాలు మొగ్గు చూపించారు.
అయితే మళ్లీ 2024 ఎన్నికల్లో గెలిచేందుకు అదే సంక్షేమ పథకాలను నమ్ముకోవడం తో అవి తమకు ఇబ్బందికరంగా మారుతాయని గ్రహించిన బాబు ఇప్పుడు సంక్షేమ పథకాలపై పూర్తిగా ఫోకస్ పెట్టారు.
అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను టిడిపి అమలు చేస్తుందని ప్రకటిస్తున్నారు.
తాజాగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన బాబు ఈ విషయాన్ని ప్రకటించారు.రాష్ట్రం అప్పుల్లో కోరుకుపోయిందని, తాము అధికారంలోకి వస్తే ఒకపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే , మరోపక్క పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తామని బాబు ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కంటే మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని బాబు కుప్పం సభలో హామీ ఇచ్చారు.హామీ ఇవ్వడంతో సరిపెట్టకుండా, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఒక ప్రత్యేక టీం ను కూడా బాబు ఏర్పాటు చేసినట్టు సమాచారం.

అయితే ఈ సంక్షేమ పథకాలు గతంలో మాదిరిగా కాకుండా నేరుగా ప్రజలకు సొమ్ములు అందించే విధంగా ఉండేలా ప్రత్యేకంగా రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.ఈ నగదు బదిలీ పథకాలు ఖజానాకు భారంగా ఉండే అవకాశం ఉన్నా, సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేయాలనే విషయంపైనే ఒక ప్రత్యేక టీం వ్యూహాలు రూపొందిస్తున్నట్లు సమాచారం.ఏది ఏమైనా గతంలో బాబు అభివృద్ధి అంశం పైన ఎక్కువగా దృష్టి పెట్టేవారు.సంక్షేమ పథకాలను అంతగా పట్టించుకునేవారు కాదు.కానీ మారిన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో టిడిపిని ఏపీలో అధికారంలోకి తీసుకురావాలంటే సంక్షేమ పథకాలు, నగదు బదిలీ పథకాలే ఏకైక మార్గంగా బాబు భావిస్తున్నారట.







