ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి.ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య పోరు హోరా హరీగా నడుస్తోంది.2024 ఎన్నికల్లో గెలవడమే రెండు పార్టీల ప్రధాన లక్ష్యం కావడంతో, ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు మరింత తీవ్రతరం చేశాయి.దీనికి తగ్గట్టుగానే, అని ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.
ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గర అయ్యేందకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇక టిడిపి అధినేత చంద్రబాబు అయితే 2019 ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ పరిస్థితి ఏమిటనేది పూర్తిగా అర్థం చేసుకున్నారు.
దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి ఆయన నిత్యం జనాల్లో ఉండేందుకు ప్రయత్నిస్తూనే వస్తున్నారు.కరోనా సమయంలోను బాబు ఏపీలో పర్యటనలు చేపట్టారు.
ఇక నిరంతరం ఏదో ఒక కార్యక్రమం తో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు బాబు ప్రయత్నిస్తూ తగిన వ్యూహాలు రచిస్తున్నారు.
అయితే గతం నుంచి చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా, చాలామంది నాయకులు ,కార్యకర్తలు పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ ఉండేవారు.
కేవలం ముఖ్య నాయకులు మాత్రమే ఆయా కార్యక్రమాలను నిర్వహించేవారు.ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటాలు చేయవలసిందిగా పదేపదే బాబు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తులు చేసినా, ఎవరు పట్టించుకోనట్టుగానే వ్యవహరించేవారు.
వారిలో ఉత్సాహం నింపేందుకు జిల్లాల పర్యటనలు, మినీ మహానాడు లాంటివి నిర్వహిస్తూ వస్తున్నారు.అయినా బాబు ఆశించిన స్థాయిలో అయితే పార్టీ శ్రేణుల్లో కదలిక కనిపించలేదు.అయితే గత మూడు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్న క్యాంటీన్ ను వైసీపీ నాయకులు ధ్వంసం చేయడం, చంద్రబాబు పైన భౌతిక దాడులకు దిగేందుకు ప్రయత్నించడం వంటి వ్యవహారాలతో టిడిపి కూడా దీనిని గట్టిగానే తిప్పికొట్టింది.ఇక ఆ తర్వాత ఏపీలో టిడిపి శ్రేణులు అంతా ఏకమయ్యాయి.

సోషల్ మీడియాలోనూ టిడిపి అనుకూలంగా పోస్టింగ్ పెడుతూ కుప్పం నియోజకవర్గం పరిణామాలపై స్పందిస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నిలబదుతున్నారు.ఇప్పటి వరకు గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న నియోజకవర్గాల్లోనూ నాయకులు ఏకతాటిపైకి వచ్చి బాబుకు సంఘీభావంగా పార్టీని మరింత బలోపేతం చేసి , 2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.కుప్పం లో బాబుకు అవమానాలు కలిగినా, ఇప్పుడు పార్టీ బలోపేతానికి, కార్యకర్తల్లో చురుకుదనం పెరగడానికి మాత్రం ఇది బాగా దోహదం చేసిందనే చెప్పాలి.







