అన్ని అవయవాలు సరిగ్గా వున్నవారే ఏమి చేయలేని చేతకాని పరిస్థితులలో మగ్గుతున్నవేళ రెండు కళ్ళు లేని అతడు విజయాన్ని సాధించాడు.లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో సాధన చేస్తే సాధించలేనిది ఏమిలేదని నిరూపించాడు.
వివరాల్లోకి వెళితే… అతని పేరు సౌరభ్.అతను జార్ఖండ్‌లోని ఛత్రలోని తాండ్వా నివాసి.
తన తండ్రి ప్రేరణ, తన స్వంత కృషితో అతను IIT ఢిల్లీకి వెళ్ళాడు.ప్రస్తుతం చదువు కొనసాగిస్తున్న సమయంలోనే మైక్రోసాఫ్ట్‌లో రూ.51 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు.
సౌరభ్ తన చిన్నతనంలోనే కంటిచూపు కోల్పోయాడు.
అయితే తనకు ఏది చేతకాదని ఓ మూలన మాత్రం కూర్చోలేదు.చిన్నతనం నుంచి ఏదో ఒకటి సాధించాలన్న కోరికతో పట్టుదలతో కృషిచేస్తూ ముందుకు సాగిపోయేవాడని సౌరభ్ తండ్రి మహేష్ ప్రసాద్ గుప్తా చెప్పారు.
చిన్నప్పటి నుంచి గ్లకోమా వ్యాధితో బాధపడుతూ మూడో తరగతి తర్వాత అతను తన కంటిచూపుని పూర్తిగా కోల్పోయాడు.ఆ తరువాత తండ్రి మహేష్ అతన్ని ఉన్నత చదువులు చదివించాలని సంత్ మిఖాయిల్ స్కూల్లో చేర్పించాడు.
అక్కడే సౌరభ్ ఏడో తరగతి వరకు చదివాడు.

ఆ తర్వాత అతను ఓ పెద్ద సమస్యని ఎదుర్కొన్నాడు.8వ తరగతి నుండి 10వ తరగతి పుస్తకాలు బ్రెయిలీ లిపిలో ముద్రించబడలేదు.దాంతో సౌరభ్ తన కష్టమంతా వృధా అని భావించాడు.
అయితే సౌరభ్ అభ్యర్థన మేరకు ప్రభుత్వం సదరు పుస్తకాలను ముద్రించింది.ఆ తర్వాత అతను NIVS డెహ్రాడూన్ స్కూల్లో అడ్మిషన్ పొంది, డెహ్రాడూన్‌లో చదువుతూ మెట్రిక్యులేషన్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
ఆ తర్వాత ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న ఠాగూర్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అడ్మిషన్ పొంది 2019లో ISCలో 93% మార్కులు సాధించాడు.అదే సమయంలో JEE మెయిన్స్‌లో కూడా అర్హత సాధించి ఢిల్లీ IITలో అడ్మిషన్ పొంది CSE మూడో సంవత్సరం చదువుతుండగానే మైక్రోసాఫ్ట్‌లో రూ.51 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొంది రికార్డు సాధించాడు.







