తండ్రి-కూతురు, తల్లి-కొడుకుల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది.ముఖ్యంగా కుమార్తెలకు తండ్రే హీరో.
ఇక తండ్రులు కూడా తమ కుమార్తెలను ప్రత్యేకంగా చూస్తారు.వారికి చిన్న దెబ్బ తగిలితే విలవిలాడిపోతారు.
ఇక అన్నిటి కంటే ముఖ్యంగా పెళ్లి చేసి, అత్తారింటికి పంపేటప్పుడు కళ్ల వెంట తండ్రులకు నీళ్లొచ్చేస్తాయి.అంతలా వారి మధ్య అనుబంధం పెనవేసుకుని ఉంటుంది.
తాజాగా తండ్రి-కూతురి మధ్య అనుబంధాన్ని కళ్లకు కట్టే ఓ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల సంజయ్ కుమార్ (డిప్యూటీ కలెక్టర్) ట్విట్టర్‌లో అందరి హృదయాలను తాకే ఓ వీడియోను పోస్ట్ చేశారు.అందులో తండ్రి-కుమార్తె మధ్య అనుబంధం ఎలాంటిదో తెలుపుతోంది.ఇక కుమార్తెను ఎంతో అల్లారుముద్దుగా పెంచిన ఆ తండ్రి, తమ బిడ్డను అత్తారింటికి పంపే ముందు ఎంతో భావోద్వేగానికి గురవుతాడు.తమ ఇంటి మహాలక్ష్మిగా పెంచుకున్న కుమార్తె గుర్తుగా ఆమె పాద ముద్రలను సేకరించాడు.
ముందుగా తన కుమార్తె పాదాలను ఓ పళ్లెంలో పెట్టాడు.వాటిని ఎంతో అపురూపంగా కడిగాడు.
ఆ తర్వాత రంగు నీటిని ఉంచిన మరో పళ్లెంలో ఆమె పాదాలను పెడతాడు.వాటిని ఓ తెల్లని వస్త్రంపై కాలి ముద్రలు పడేలా పెడతాడు.
ఈ ప్రక్రియ చేస్తున్నంత సేపు ఆ తండ్రికి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి.తమ ఇంట్లో చిన్నప్పటి నుంచి బుడి బుడి అడుగులు వేస్తూ తిరిగిన కుమార్తె, అత్తారింటికి వెళ్లడం ఆ తండ్రిని కుంగదీసిందని చెప్పవచ్చు.
అయితే ఆమె పాదముద్రలను పెట్టుకుని, చిన్నప్పటి నుంచి ఆమె స్మృతులతో గడపాలని నిశ్చయించుకుని అలా చేశాడు.ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.
తండ్రి, కుమార్తె మధ్య అనుబంధం మాటల్లో వివరించలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







