అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎంతో మంది అమెరికన్స్ ఎదురు చూస్తున్న, అలాగే మరో సారి డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యే అత్యంత ప్రతిష్టాత్మకమైన బిల్లుపై సంతకం చేసి ఆమోద ముద్ర వేశారు.అయితే ఈ బిల్లు కు ఆమోదం తెలుపడం వెనుక ప్రజా సంక్షేమం అనే అంశం కంటే కూడా డెమోక్రటిక్ పార్టీ సంక్షేమం ఎక్కువగా కనిపిస్తోందని, ఈ బిల్లు వలన ప్రజలకు ఒరిగేదేమి లేదని రిపబ్లికన్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఇంతకీ ఏమిటా బిల్, ఈ బిల్లు వలన కలిగే ప్రయోజనం ఏంటి, డెమోక్రటిక్ పార్టీకి ఈ బిల్లు వచ్చే ఎన్నికల్లో ఎలా ఉపయోగపడుతుందంటే…
అమెరికాలోనే చారిత్రాత్మకమైన బిల్లుగా భావిస్తున్న క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ కేర్ బిల్లును అమెరిక అధ్యక్షుడు జో బిడెన్ తన సంతకంతో ఆమోదించి చట్ట రూపం తీసుకువచ్చారు.ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే.
అమెరికాలో వాతావరణ మార్పుల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ ప్రధాన ఎజెండా.ఇందులో సౌర, గాలి విద్యుత్ లను సృష్టించే ప్రాజెక్ట్ లకు భారీ రాయితీలు ఇవ్వడంతో పాటు వాతావరణ మార్పుల నియంత్రణ కోసం చర్యలు చేపడుతుంది.
ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 37,500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనుంది.అంతేకాదు ప్రజారోగ్య దృష్ట్యా

2000 డాలర్లు కి మించకుండా మెడికేర్ గ్రహీతలు తమ డబ్బులు ఖర్చు చేయకుండా చేస్తుంది.అంటే వారికి అందుకు అనుగుణంగా ఓ ప్రత్యేకమైన విధానాన్ని తీసుకువస్తుంది.అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు ఇన్సులిన్ కోసం నెలకు 35 డాలర్ల కు మించి చెల్లించకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
కరోనా సమయంలో ఆరోగ్య భీమా ప్రీమియంల కోసం సుమారు కోటి మందికి పైగా చెల్లించిన చెల్లింపులను మరో మూడేళ్ళ పాటు కొనసాగిస్తుంది.ప్రజలు సులువుగా విద్యుత్ ఆదా చేసేలా, తమ కుటుంబాలను అభివృద్ధి పరుచుకునేలా, అల్పాదాయ వాడల్లో పన్ను రాయితీలను కల్పించనుంది.
అంతేకాదు వారికి ఋణాలు, పెట్టుబడులు ఇచ్చి అభివృద్ధి పొందేలా చర్యలు చేపట్టనుంది.అలాగే సంపన్నులు పన్నులు చెల్లించేలా బడా కంపెనీల మీద పన్నులు పెంచేలా చర్యలు చేపట్టాలని ఈ బిల్లు సూచిస్తోంది.
అయితే ఈ బిల్లు వలన ప్రజలపై పన్నుల భారం మరింత పెరుగుతుందని ఆర్ధిక ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుందని, కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిడెన్ ఈ బిల్లును ప్రవేశ పెట్టారని దీనివలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని, ఈ బిల్లు కేవలం బిడెన్ తన ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో కాపాడు కోవడం కోసమే తెరపైకి తీసుకువచ్చిందని ఈ బిల్లును ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.కాగా ఈ బిల్లు ఆమోదం పొందటంలో రిపబ్లికన్ పార్టీ నేతల్లో కొందరి మద్దతు ఉండటం గమనార్హం.







