తల్లిదండ్రులకు పిల్లలంటే చాలా ఇష్టం.వారే తమ పంచ ప్రాణాలుగా భావిస్తారు తల్లిదండ్రులు.
ఈ ప్రేమ ఆప్యాయతలు మనుషులలోనే కాదు జంతువుల్లో కూడా కనిపిస్తుంది.తమ పిల్లలకు ఏదైనా ఆపద ఉందనుకుంటే వాటిని సంరక్షించేందుకు తల్లి తన ప్రాణాలను సైతం అడ్డంగా పెడుతుంది.
అయితే ఈ మాటలను అక్షర సత్యం చేస్తూ తాజాగా ఏనుగులు తమ పిల్లను కాపాడడానికి పెద్ద రిస్క్ చేశాయి.ఒక ఏనుగు పిల్ల నీళ్లు తాగుతూ పొరపాటున స్విమ్మింగ్ పూల్ లో పడి మునిగిపోయింది.
దీనిని కాపాడడానికి తల్లితో పాటు మరొక పెద్ద ఏనుగు పెద్ద సాహసమే చేశాయి.సిమ్మింగ్ పూల్ లోపలికి వెళ్లి ఆ చిన్న ఏనుగును బయటికి తీసుకు వచ్చాయి.
దీనికి సంబంధించిన వీడియోని శనివారం ట్విట్టర్‌లో గాబ్రియెల్ కార్నో అనే యూజర్ షేర్ చేశాడు.వీడియో ప్రకారం ఈ ఘటన దక్షిణ కొరియాలోని సియోల్ జూలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో తల్లి, ఏనుగు పిల్ల ఒక స్విమ్మింగ్ పూల్ లో నీరు తాగడంతో చూడవచ్చు.ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆ పిల్ల ఏనుగు నీటిలో పడిపోయింది.
ఈ దృశ్యం చూసి తల్లికి గుండెపగిలినట్లయింది.తన పిల్ల తన కళ్లముందే నీటిలో మునిగి పోతుంటే చూడలేకపోయింది.
నీటిలో పడిన పిల్ల ఏనుగును చూసి మరొక పెద్ద ఏనుగు కూడా చలించిపోయింది.సహాయం చేయడానికి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చింది.

ఈ రెండు ఏనుగులు కలిసి పిల్ల ఏనుగును రక్షించడానికి ఏం చేయాలా అని ఆలోచించాయి.ఆ తర్వాత వాటికి ఒక ఐడియా తట్టింది.అనంతరం అవి క్షణాల్లోనే స్విమ్మింగ్ పూల్ ఎంట్రన్స్ ద్వారా అందులోకి దిగాయి.ఆ తర్వాత ఆ పిల్ల ఏనుగును స్విమ్మింగ్ పూల్ ఎంట్రన్స్ వైపు నడిపించాయి.అలా దానిని బయటకు తీసుకు వచ్చాయి.దీంతో ఆ పిల్ల ఏనుగు ప్రాణాలు దక్కాయి.
దీనికి సంబంధించిన వీడియోకి ఇప్పటికే 22 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.లక్ష వరకు లైకులు వచ్చాయి.
దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.







