అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఓ స్కూల్‌లో ఉన్మాది జరిపిన కాల్పుల ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలోని గన్ కల్చర్‌పై మరోసారి చర్చ జరుగుతోంది.
అక్కడి డెమొక్రాట్లు తుపాకుల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.రిపబ్లికన్లు మాత్రం గన్ లాబీకి మద్ధతుగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో అమెరికాకు పొరుగున వున్న కెనడా సైతం గన్ కల్చర్‌పై దృష్టి సారించింది.దీనికి తోడు ఇటీవలికాలంలో గ్యాంగ్‌వార్‌లు, హత్యాకాండల్లో తుపాకుల వినియోగం ఎక్కువ కావడంతో వీటికి అడ్డుకట్ట వేయాలని జస్టిన్ ట్రూడో సర్కార్ నిర్ణయించింది.
దీనిలో భాగంగా ఈ నెలలో దేశంలోకి తుపాకుల దిగుమతిని నిషేధించాలని ఫిక్స్ అయ్యింది.
ప్రస్తుతం కోస్టారికాలో విహారయాత్రలో ఉన్న ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ట్విట్టర్‌లో ఇలా ప్రకటించారు.
‘‘ఆగస్ట్ 19 నాటికి కెనడాలో హ్యాండ్ గన్‌ల దిగుమతి నిషేధిస్తాం.జాతీయ స్థాయిలో హ్యాండ్ గన్‌లను స్తంభింపజేసే వరకు నిషేధం అమల్లో వుంటుంది.
ఇకపై కెనడాలో ఎక్కడైనా చేతి తుపాకులను కొనడం , విక్రయించడం లేదా బదిలీ చేయడం అసాధ్యం’’ అని ఆయన పేర్కొన్నారు.

టెక్సాస్ కాల్పుల ఘటన తర్వాత దేశంలో హ్యాండ్‌గన్స్‌ని స్తంభింపజేసే బిల్లు ‘‘ సీ 21 ’’ని ప్రవేశపెట్టింది ట్రూడో సర్కార్.అయితే సంబంధిత బిల్లును పార్లమెంట్ ఆమోదించాల్సి వుంది.ఏది ఏమైనా కెనడాలో హ్యాండ్‌గన్ ఫ్రీజ్‌ను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం కోరుకుంటోందని విదేశాంగ మంత్రి మెలానీ జోలీ, పబ్లిక్ సేఫ్టీ మంత్రి మార్కో మెండిసినో తెలిపారు.
ఈ మేరకు ఇద్దరూ కలిసి సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.ఈ చర్యను తుపాకుల దిగుమతిపై తాత్కాలిక నిషేధంగా వారు అభివర్ణించారు.దేశంలో తుపాకీ నేరాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు తమ వద్ద వున్న అన్ని సాధనాలను ఉపయోగిస్తున్నామని మెండిసినో తెలిపారు.
2020తో పోల్చితే 2021లో సరిహద్దు ప్రాంతాల్లో రెట్టింపు సంఖ్యలో ఆయుధాలను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయని ఈ ప్రకటనలో వెల్లడించారు.జనవరి, జూన్ మధ్య కాలంలో కెనడా 26.4 మిలియన్ల విలువైన పిస్టల్స్, రివాల్వర్‌లను దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.2021లో ఇదే సమయంతో పోలిస్తే ఇది 52 శాతం పెరిగింది.







