పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యతో భారత్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.ఇది తమ పనేనంటూ కెనడాలో వున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించడంతో.
కెనడాలోని పంజాబీ గ్యాంగ్‌లపై ఒక్కసారిగా చర్చ మొదలైంది.ఎన్నో పంజాబీ ముఠాలు కెనడాను అడ్డాగా చేసుకుని భారత్‌లో నేర సామ్రాజ్యాలను విస్తరిస్తున్నాయి.
కిరాయి హత్యలు, డ్రగ్స్, ఆక్రమ ఆయుధాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి.ఈ నేపథ్యంలో కెనడాలో వుంటూ పంజాబ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్‌స్టర్‌లను పట్టుకునేందుకు తమకు సహకరించాలంటూ ఇటీవల కెనడా ప్రభుత్వాన్ని కోరారు సీఎం భగవంత్ మాన్.
ఇప్పటికే పలువురు గ్యాంగ్‌స్టర్‌లపై పంజాబ్ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో పాటు అప్పగింతపై కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే వున్నారు.వీరిలో లఖ్‌బీర్ సింగ్ లాండా, అర్ష్ ధల్లా, గోల్డీ బ్రార్, రామన్ జడ్జి, రింకు రంధావా, బాబా డల్లా, సుఖా దునేకే ఇలా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్లంతా కెనడాలోనే వున్నారు.
వరుస ఘటనల నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయి హింసకు పాల్పడిన 11 మంది గ్యాంగ్‌స్టర్లకు సంబంధించి కెనడా పోలీసులు అరుదైన హెచ్చరిక జారీ చేశారు.
వీరికి దగ్గరగా వుండకూడదని పౌరులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.ఈ 11 మందిలో తొమ్మిది మంది పంజాబ్ మూలాలున్న వారే కావడం గమనార్హం.బ్రిటీష్ కొలంబియా పొలీస్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ… ప్రావిన్స్‌లో జరిగిన హత్యలు, కాల్పులతో వారికి సంబంధం వుందన్నారు.ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్లు వీరిని లక్ష్యంగా చేసుకునే అవకాశం వున్నందున వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగులకు కూడా ప్రమాదం పొంచి వుందని పోలీసులు తెలిపారు.
అందువల్ల ఈ 11 మంది గ్యాంగ్‌స్టర్లకు, వారి ఇళ్లకు దూరంగా వుండాలని సూచించారు.

ఇకపోతే.ఈ 11 మంది వ్యక్తుల జాబితాలో వున్న మెనిందర్ ధాలివాల్ గత నెల చివరిలో విస్లర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.ఇతని సోదరుడు హర్‌ప్రీత్ గతేడాది వాంకోవర్‌లోని కోల్ హార్బర్ పరిసరాల్లో హత్యకు గురయ్యాడు.
వీరి మరో సోదరుడు 35 ఏళ్ల గురుప్రీత్ ధాలివాల్ ఈ ఏడాది గ్యాంగ్‌స్టర్ల లిస్ట్‌లో వున్నాడు.