తెలంగాణలో మరో ఉప ఎన్నిక వచ్చేలా కనిపిస్తోంది.మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.
అంతకంటే ముందుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే తెలంగాణలో చాలా ఉప ఎన్నికలు జరిగాయి.
దుబ్బాక, నాగార్జునసాగర్, హుజురాబాద్ లలో ఉప ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికలలో నాగార్జునసాగర్ మినహా మిగతా అన్నిచోట్ల టిఆర్ఎస్ ఓటమి చెందడంతో, 2023 ఎన్నికల ఫలితాలకు ఇవి రెఫరెండంగా బిజెపి ప్రచారం చేసుకుంటుండగా, ఇప్పుడు మరోసారి తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతాలు వెలబడుతున్నాయి.
ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరాలని చూస్తున్నారు.ఎప్పటి నుంచో ఆయన బిజెపిలో చేరాలని చూస్తున్నా, సరేనా అనుకూల పరిస్థితులు లేకపోవడం తదితర కారణాలతో ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు.
ఇటీవలే బిజెపి ఎంపీ ప్రశాంత్ దూబే ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా బిజెపిలోకి చేరే విషయమై అమిత్ షా తో చర్చించగా కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు బిజెపిలో చేరాల్సిందిగా అమిత్ కండిషన్ విధించినట్లుగాను ప్రచారం జరిగింది.
దీంతో రాజగోపాల్ రెడ్డి సైతం పార్టీకి పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరాలని డిసైడ్ అయిపోయారట.త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని బిజెపి కండువా కప్పుకునేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు వెలుగోడుతున్నాయి.

అదే జరిగితే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి.రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, దానిని స్పీకర్ కనుక ఆమోదిస్తే, అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి.బిజెపి కూడా ఇదే జరగాలని కోరుకుంటోంది.దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల ఫలితాలను మళ్లీ మునుగోడులో రిపీట్ చేసి , అక్కడ గెలిచి చూపించాలనే ప్లాన్ తోనే రాజగోపాల్ రెడ్డికి రాజీనామా కండిషన్ బిజెపి విధించినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోను గెలుపు బిజెపిదే అనే సంకేతాలను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుందనే లెక్కల్లో బిజెపి ఉంది.ఈ మేరకు వరంగల్ లో వచ్చే నెల మొదటి వారంలో జరగనున్న బిజెపి భారీ బహిరంగ సభలో రాజగోపాల్ రెడ్డిని చేర్చుకోవాలనే ప్లాన్ లో ఆ పార్టీ ఉంది.
రాజగోపాల్ రెడ్డి తో పాటు, పెద్ద ఎత్తున ఇతర టిఆర్ఎస్ నేతలను బిజెపిలో చేర్చుకునే వ్యూహం తో ముందుకు వెళుతున్నారు.ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బిజెపిలో చేరితే ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నాము అన్నట్లుగా టిఆర్ఎస్ కూడా సంకేతాలు ఇస్తుండడంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావడం అనివార్యంగా కనిపిస్తోంది.







