అమెరికాలో భారతీయ విద్యార్ధిని మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.మూడేళ్ల క్రితం అదృశ్యమైన మయూషీ భగత్ కోసం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలో దిగింది.
ఆమెను ‘‘ మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్ ’’లోకి చేర్చింది.ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తక్షణం తమకు అందించాలని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
మయూషీ భగత్ 2016లో స్టూడెంట్ వీసా (ఎఫ్ 1) ద్వారా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చింది.న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌వైఐటీ)లో మూడేళ్ల పాటు చదువుకుంది.
ఈ నేపథ్యంలో 2019, ఏప్రిల్ 29న న్యూజెర్సీలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన మయూషీ మళ్లీ తిరిగిరాలేదు.చుట్టుపక్కల తీవ్రంగా గాలించిన కుటుంబ సభ్యులుకు ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో రెండురోజుల తర్వాత మే 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీస్ సిబ్బంది సైతం కొద్దిరోజులు పాటు మయూషీ కోసం గాలించారు.కానీ వీరి ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో కేసును దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ చేతికి అప్పగించారు.

దీనిలో భాగంగా నెవార్క్ డివిజన్ ఎఫ్‌బీఐ అధికారులు మయూషీ పేరును మిస్సింగ్ పర్సన్స్ జాబితాలోకి చేర్చారు.ఆమె ఇంటి నుంచి చివరిసారిగా బయటకు వెళ్లిన తర్వాత కలర్‌ఫుల్ పైజామా ప్యాంట్, బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించినట్లు అందులో తెలిపారు.చమన ఛాయతో 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు వుంటుందని… ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ అనర్గళంగా మాట్లాడగలదని అధికారులు తెలిపారు.ఆమె ఆచూకీ తెలిసిన వారు దగ్గరిలోని ఎఫ్‌బీఐ కార్యాలయంలో కానీ, అమెరికన్ దౌత్య కార్యాలయాలకు కానీ సమాచారం అందించాలని ఎఫ్‌బీఐ అధికారులు విజ్ఞప్తి చేశారు.







