తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీలో ఇప్పటివరకు రెండుసార్లు ఎన్నికలు జరిగాయి.ఒకసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చాయి.
అయితే 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కసీటు మాత్రమే సాధించింది.ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఆ పార్టీ కూడా అధికారంపై కన్నేసింది.
దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ లేదా వైసీపీలకు ప్రజలు రెండోసారి అవకాశం ఇస్తారా లేదా పవన్ కళ్యాణ్‌కు కూడా ఒకసారి అవకాశం ఇస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది.అయితే జనసేనకు అధికారంలో వచ్చేంత బలం ఉందా అనే ప్రశ్నను చాలామంది సంధిస్తున్నారు.
ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.కౌలు రైతుల భరోసా యాత్ర పేరుతో జిల్లాలలో తిరుగుతున్న పవన్.
మరోవైపు ప్రజావాణి పేరుతో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో తనను గెలిపించాలని పవన్ కోరుతున్నారు.
వైసీపీ లేని ఏపీని తీసుకురావాలని.తాను అధికారంలోకి వస్తే ప్రజలకు రాష్ట్రానికి కూడా మేలు చేస్తానని పవన్ స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, వారి విషయాలు పరిశీలించకుండా కేవలం తనను చూసి ఓటేయాలని పవన్ పిలుపునిస్తున్నారు.తన పార్టీ తరఫున గెలిచే వారికి తానే బాధ్యత వహిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
శ్రీలంకలో ప్రజలు తిరుగుబాటు చేసిన తరహాలో ఏపీలో కూడా ప్రజలు వైసీపీ సర్కారుపై తిరగబడాలని చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్‌ను అసలు ఎలా నమ్మాలని కొన్ని వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉండి రాష్ట్రానికి జనసేన ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.రేపటి రోజున అధికారం కట్టబెడితే కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎలా సాధిస్తారని నిలదీస్తున్నారు.
పెట్రోల్ ధరలు పెరిగినా, గ్యాస్ ధరలు పెరిగినా బీజేపీపై పవన్ ఎలాంటి ఆరోపణలు చేయలేదన్న విషయాన్ని కూడా పలువురు గుర్తుచేస్తున్నారు.కాగా అధికారంలో ఉన్నా లేకపోయినా… పౌర్ణమి లేదా అమావాస్యకు రాజకీయాలు చేసే పవన్‌పై ప్రజల్లో నమ్మకం ఏర్పడాలంటే నిత్యం ఆయన ప్రజల్లోనే ఉండాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.







