అమెరికాలోని టెక్సాస్‌లో ఇటీవల ఓ పాఠశాలలో ఉన్మాది జరిపిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.
అంతేకాదు అమెరికాలో గన్ కల్చర్‌గా సీరియస్‌గా దృష్టి సారించాలని అక్కడి ప్రభుత్వానికి సూచించింది.ఈ సంగతి పక్కనబెడితే.21 మంది ప్రాణాలు తీసిన ఈ మారణకాండపై టెక్సాస్ శాసనసభ్యుల విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.‘‘వ్యవస్థాపరమైన వైఫల్యాలు’’, ‘‘ పేలవమైన నాయకత్వం’’ ఈ మరణాలకు కారణమని ఆదివారం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.
టెక్సాస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ తన విచారణలో మే 24న రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో 18 ఏళ్ల ముష్కరుడిని ఎదుర్కోవడానికి, మట్టుబెట్టడానికి… పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు గంటకు పైగా సమయం ఎందుకు పట్టిందో తెలుసుకోవడానికి యత్నించింది.చట్టాన్ని అమలు చేసే అధికారులు.సాయుధుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని, వారి వ్యక్తిగత ఆత్మరక్షణకే ప్రాధాన్యతనిచ్చి, అమాయకుల ప్రాణాలను రక్షించడంలో విఫలమయ్యారని నివేదికలో చట్టసభ సభ్యులు మండిపడ్డారు.
77 పేజీల ఈ నివేదికలో 376 మంది లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్పష్టమైన నాయకత్వం లేకుండా , అస్తవ్యస్తమైన ప్రణాళికతో పాఠశాలకు చేరుకున్నారని ప్రస్తావించారు.కాల్పులు జరిపిన నిందితుడిని మినహాయించి, కమిటీ తన దర్యాప్తులో ‘విలన్’లను కనుగొనలేదని దుయ్యబట్టింది.దీనికి బదులుగా తాము వ్యవస్థాగత వైఫల్యాలు, పేలవమైన నిర్ణయాలను కనుగొన్నామని నివేదికలో పేర్కొన్నారు.
గాయపడిన బాధితులకు సహాయం అందించడంలోనూ జాప్యం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువైందని కమిటీ పేర్కొంది.
పాఠశాల చుట్టూ వున్న ఐదు అడుగుల ఎత్తైన కంచె సాయుధుడిని ఏ మాత్రం అడ్డుకోలేకపోయిందని.
తలుపులకు తాళాలు వేయని సిబ్బంది నిర్లక్ష్యం కనిపించిందని, తాళం వేయని తలుపు ద్వారా ముష్కరుడు సులభంగా లోపలికి ప్రవేశించాడని నివేదికలో పేర్కొన్నారు.నిందితుడు మొత్తం 142 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తేల్చారు.
అధికారులు దుండగుడి కోసం హాలును చుట్టుముట్టిన సమయంలో పిల్లలు దాదాపు ఆరుసార్లు 911కి ఫోన్ చేసి సహాయం కోసం అర్ధించారని అధికారులు మే నెలలోనే తెలిపారని వెల్లడించింది.

ఈ ఘటనకు సంబంధించి ఉవాల్డే మేయర్ డాన్ మెక్ లాఫ్లిన్ ఒక ప్రకటనలో ఇలా అన్నారు.‘‘కాల్పులు జరిగిన రోజు నుంచి సిటీ పోలీస్ తాత్కాలిక చీఫ్‌గా వున్న లెఫ్టినెంట్ మరియానో పర్గాస్‌ను పరిపాలనా సెలవుపై వుంచినట్లు తెలిపారు.అలాగే ఆదివారం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారుల బాడీ కెమెరా ఫుటేజీని కూడా ఆయన విడుదల చేశారు.
వీటిలో గందరగోళం, లోపాలు, వైఫల్యాలు కనిపించాయి.







