ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలంలో ఆగస్టు 10తో ముగియనుంది.ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కసరత్తు జరుగుతోంది.
అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన అభ్యర్థికి అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్టానం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముస్లిం మైనారిటీ నేతను ఎంచుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి.
దీంతో మైనారిటీ నేతల్లో మంచి పాపులారిటీ ఉన్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు తెరపైకి వచ్చింది.
ముఖ్యంగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన కేంద్రమంత్రి పదవికి కూడా రాజీనామా చేయడంతో ఆయనే కొత్త ఉపరాష్ట్రపతి అవుతారని అందరూ భావించారు.
అయితే ఈ విషయంపై బీజేపీ మాతృసంస్థ సంఘ్ పరివార్‌కు, గుండె లాంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది.దీంతో బీజేపీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో దక్షిణాదిలో పార్టీని విస్తరించాలని పావులు కదుపుతున్న బీజేపీ ఉపరాష్ట్రపతి పదవిని మరోసారి దక్షిణాదికే ఎందుకు ఇవ్వకూడదని సమాలోచనలు జరుపుతోంది.
దీంతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడినే కొనసాగిద్దామా లేదా తమిళనాడుకు చెందిన తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అవకాశమిద్దామా అని బీజేపీ అగ్రనేతలు యోచిస్తున్నారు.
మరోవైపు ఇతరుల పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.వారిలో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర మాజీ మంత్రులు సురేశ్ ప్రభు, ఎస్‌ఎస్ ఆహ్లూవాలియా, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్ పురీ, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ వంటి ప్రముఖులు ఉన్నారు.

కాగా ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థిని నిర్ణయించనుంది.బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు.







