తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన మార్క్ చూపించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే చేరికలతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద మంచి మార్కులే కొట్టేసిన రేవంత్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే వరంగల్ లో రైతు డిక్లరేషన్ సభను భారీగా నిర్వహించి సక్సెస్ అయ్యారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ హాజరు కావడం , భారీ జన సందోహం మధ్య సభ జరగడంతో, రేవంత్ ప్రభావం మరింతగా పెరిగింది.
ఆయన సారధ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అధిష్టానం పెద్దలకు నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు వరుస చేరికలతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న రేవంత్ మరో ముందడుగు వేశారు.
ఈ మేరకు రాహుల్ గాంధీని మరోసారి తెలంగాణకు తీసుకువచ్చేందుకు రేవంత్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.తెలంగాణ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసేందుకు , టిఆర్ఎస్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు వ్యూహాత్మక ఎత్తుగడకు తెర తీశారు.
ఈ మేరకు రాజన్న సిరిసిల్లకు రాహుల్ గాంధీని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిరిసిల్లలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ ద్వారా నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించేందుకు రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం పై రైతులతో పాటు నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని , రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.అందుకే రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించి, తన సత్తా కాంగ్రెస్ అధిష్టానం వద్ద చాటుకోవాలని ప్రజల్లో కాంగ్రెస్ ప్రభావం మరింత పెరిగేలా చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు .

అయితే సిరిసిల్లను దీనికి ఎంచుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో నుంచి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.టిఆర్ఎస్ లో కేటీఆర్ కీలకమైన వ్యక్తి కావడంతో, ఆయన గెలుపు పై ప్రభావం పడేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గంలో రాహుల్ తో సభ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.ఈ మేరకు ఈ సభలో పాల్గొనేందుకు రాహుల్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.







