వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించి అప్పుడే ఏడాది అయింది.ఈ ఏడాది కాలంలో షర్మిల పార్టీని ఏ మేరకు బలోపేతం చేశారు ? ఏ విధమైన వ్యవహారంతో ముందుకు వెళ్తున్నారు ? తెలంగాణలో అధికారంలోకి పార్టీని తీసుకురావాలని ఆమె కోరిక ఎంతవరకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి ? పార్టీలో చేరికల సంగతేంటి ఇలా అనేక అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి.దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఆయన చరిష్మాను ఉపయోగించుకుని తెలంగాణలో బలమైన నాయకురాలిగా మారేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు.అంతే కాదు తెలంగాణ కోడలి హోదా చూపిస్తూ స్థానికేతురాలిని కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే అనుకున్న మేరకు పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లారా అంటే లేదని చెప్పాలి పార్టీ స్థాపించిన సమయంలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు పార్టీలో చేరికలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.మొదట్లో చేరికల్లో ఒక రకమైన ఊపు కనిపించినా, ఇప్పుడు అదెక్కడా కనిపించడం లేదు.
అసలు షర్మిల చేపట్టిన పాదయాత్రకు జనం అంతంత మాత్రంగా కనిపిస్తున్నారు .కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే కాస్తో కూసో షర్మిల ప్రభావం కనిపిస్తోంది.అందుకే ఆమె ఆంధ్ర బోర్డర్ కు దగ్గరగా ఉండే పాలేరు నియోజకవర్గం ను ఎంపిక చేసుకున్నారు.షర్మిల తరువాత ఆ పార్టీలో చెప్పుకోదగిన బలమైన నాయకులు కనిపించడం లేదు .మొదట్లో ఇందిరా శోభన్ వంటి వారు పార్టీలో చేరినా, సరేనా ప్రాధాన్యం దక్కకపోవడం వంటి కారణాలతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు. ఇక పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అన్ని వ్యవహారాలను తానే చక్కబెట్టిన కొండ రాఘవరెడ్డి సైతం ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించడం లేదు.

అలాగే టిఆర్ఎస్ నుంచి షర్మిల పార్టీలోకి జంప్ చేసిన గట్టు రామచంద్రరావుదీ అదే పరిస్థితి.చాలాకాలం నుంచి షర్మిల పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వారే తప్ప , కొత్తగా చేరుతున్న వారెవరు కనిపించడం లేదు.తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని హడావుడి చేస్తున్నా.ఎవరూ పట్టించుకోవడం లేదు.కనీసం మీడియా, సోషల్ మీడియాలోనూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ గురించిన చర్చ పెద్దగా జరగకపోవడం ఇవన్నీ ఆమెకు ఇబ్బందికరంగానే మారాయి.ఏడాది పొలిటికల్ జర్నీలో సాధించిన ప్రగతి కంటే కోల్పోయింది ఎక్కువగా కనిపిస్తోంది.







