తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పట్టుకుంది.ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నారు.
ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మీడియాలో మంచి కవరేజ్ లభించడంతో టీఆర్ఎస్ నేతల్లో అసహనం కనిపిస్తోంది.అది వాళ్లు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల ద్వారా తేటతెల్లం అవుతోంది.
బీజేపీకి మైలేజ్ రాకుండా గ్యాస్ ధరలు పెంచిన విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫ్లెక్సీలు వేయించి మరీ తెలంగాణ అంతటా ప్రదర్శిస్తున్నారు.
తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక నుంచి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
ఈ ఉప ఎన్నికను తాము తేలిగ్గా తీసుకోవడంతోనే ఓడిపోయామని టీఆర్ఎస్ నేతలుభావించినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ మరోసారి దెబ్బ కొట్టింది.అక్కడితో ఆగకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉపఎన్నికలోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చింది.
ముఖ్యంగా దళిత బంధు పేరుతో ఓటర్లకు ఎరవేసినా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు.
ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్.ఇలా రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో పుంజుకున్నాయని గులాబీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.దీంతో 2024 ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నారు.
అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ టీమ్ సహాయంతో స్వయంగా టీఆర్ఎస్ పరిస్థితిపై కేసీఆర్ ఏకంగా మూడు సర్వేలు చేయించినట్లు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ సర్వేల ఆధారంగా ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేల పని తీరు, వాళ్ల గెలుపు అవకాశాలపై అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయా సర్వేలలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినట్లు సమాచారం అందుతోంది.దీంతో కేసీఆర్‌లో గుబులు మొదలైంది.అందుకే జాతీయ పార్టీ ప్రకటనను కూడా ప్రస్తుతానికి కేసీఆర్ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు కేవలం 40 స్థానాలు మాత్రమే వస్తాయని సర్వేలో తేలినట్లు టాక్ నడుస్తోంది.
ఐప్యాక్ టీమ్ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.ఎమ్మెల్యేల పనితీరును విశ్లేషించడానికి కేసీఆర్ సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.