ఏపీలో ఈనెల 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించాలని వైసీపీ తలపెట్టింది.అయితే అంతకంటే ముందే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తోంది.కానీ ప్లీనరీలు పలు వివాదాలకు కేంద్రబిందువులుగా మారుతున్నాయి.ఇటీవల శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన ప్లీనరీ పలు వివాదాలకు కారణమైంది.కొద్దిరోజుల క్రితం నర్సన్నపేట ప్లీనరీలో కూడా నేతల మధ్య వివాదాలు తలెత్తాయి.
ముఖ్యంగా నర్సన్నపేట ప్లీనరీలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహంతో ఊగిపోయారు.
తగ్గేదే లే అంటూ సినిమా డైలాగులు చెప్పారు.అటు సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి అవమానాలు కూడా జరిగాయి.
దీంతో సొంత పార్టీ నాయకులే తనను అడ్డుకుంటున్నారని కిల్లి కృపారాణి అసహనం వ్యక్తం చేశారు.ప్రోటోకాల్ వివాదంపై కిల్లి కృపారాణి ఆరోపణలను వైసీపీ నేతలు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.
పలాసలో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలోనూ ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.

మున్సిపల్ ఛైర్మన్ బళ్ల గిరిబాబును వేదికపైకి పిలవకుండా ప్లీనరీలో అవమానపరిచారు.దీంతో అతిథులను మాత్రమే వేదికపైకి పిలిచామని నిర్వాహకులు ఆయనకు సర్దిచెప్పినా గిరిబాబు వినిపించుకోకుండా బయటకు వెళ్లిపోయారు.పలాస కేంద్రంగా మంత్రి సీదిరి అప్పలరాజు రాజకీయం నడుపుతున్నారు.
ఆయన వర్గానికి చెందిన వ్యక్తిగానే బళ్ల గిరిబాబుకు పేరుంది.అయినా పలాస ప్లీనరీలో గిరిబాబుకు అవమానం జరిగింది.

మొత్తానికి వైసీపీ ప్లీనరీలు పార్టీకి పెద్దతలనొప్పిగా మారాయి.కాగా జూలై 8,9 తేదీల్లో నిర్వహించే ప్లీనరీకి సంబంధించి కమిటీల నియామకం ప్రారంభించారు.ప్లీనరీ నిర్వహణ.తీర్మానాలు, సమన్వయం, ప్రసంగాలు, వసతి సదుపాయాలు వంటి వాటి కోసం పార్టీ నేతలతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.ప్లీనరీ ప్రారంభ, ముగింపు సమావేశాల్లో అధినేత జగన్ ప్రసంగం ఉండనుంది.ముగింపు ప్రసంగంలో వచ్చే ఎన్నికలకు జగన్ శంఖారావం పూరించనున్నారు.







