ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఆ దేశం స్మశానాన్ని తలపిస్తోంది.బాంబు పేలుళ్లు, ఎటు నుంచి క్షిపణులు దూసుకొస్తాయో తెలియక ఉక్రెయిన్ వాసులు బంకర్లలో బిక్కుబిక్కుమంటున్నారు.
పోని దేశం విడిచి పారిపోదామని అనుకుంటే ఇప్పటికే అన్ని నగరాలను రష్యా సేనలు కమ్మేశాయి.ప్రస్తుతం వీరితో ఉక్రెయిన్ సేనలు భీకరంగా పోరాడుతున్నాయి.
దీంతో తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడటంతో పాటు గాయాలకు చికిత్స అందక ప్రజలు విలవిలలాడుతున్నారు.ఈ నేపథ్యంలో రెడ్‌క్రాస్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థలు, పలు దేశాలు ఉక్రెయిన్‌కు మానవతా దృక్పథంతో సాయం అందిస్తున్నాయి.
బ్రిటీష్ లో భారత సంతతికి చెందిన లార్డ్ రాజ్ లుంబా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శరణార్ధులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.ఈ క్రమంలో ఇప్పటి వరకు 60 వేల పౌండ్ల నిధులను ఆయన సేకరించారు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వితంతువుల జీవితాలను మెరుగుపరిచేందుకు లుంబా అంకితమయ్యారు.ఆయనకు చెందిన NGO లూంబా ఫౌండేషన్ కు ఐక్యరాజ్యసమితి గుర్తింపు వుంది.
జూన్ 23న అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం సందర్భంగా ఇటీవలే ఈ సంస్థ 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.
దీనిలో భాగంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆయన సతీమణి చెరీ బ్లెయిర్ లు లండన్ లో జరిగిన ఈ సంస్థ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బర్నార్డోస్‌తో కలిసి ప్రారంభించిన నిధుల సేకరణ కార్యక్రమం ఈ వారం కూడా విరాళాలను అందుకుంటోంది.ఉక్రెయిన్ యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన దాదాపు 1000 కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో 1,00,000 పౌండ్లను సేకరించాలని లుంబా ఫౌండేషన్ పట్టుదలతో వుంది.

25 ఏళ్ల క్రితం స్వయంగా వితంతువైన తన తల్లి జ్ఞాపకార్థం లుంబా ఫౌండేషన్ ను స్థాపించారు లార్డ్ రాజ్ లుంబా.అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో బలమైన లాబీయింగ్ చేసి జూన్ 23ని అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించేలా చేశారు.అనుకున్నట్లుగానే లక్ష పౌండ్ల నిధులు సేకరించిన వెంటనే.యూకేకు వలస వచ్చిన ఉక్రెయిన్ వాసులకు కుటుంబానికి 100 పౌండ్ల వోచర్ ను అందజేస్తారు.దీని సాయంతో దేశవ్యాప్తంగా బర్నార్డోకు చెందిన 630 ఔట్ లెట్స్ లో లేదా ఆన్ లైన్ ద్వారా దుస్తులు, బొమ్మలు, గృహోపకరణాలతో సహా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.