యాదాద్రి జిల్లా:ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లకు సంబంధించి సెర్క్యులర్ తీసుకువచ్చారని,ఎక్కడో ఒక టీచర్ ఆస్తులు కూడబెట్టాడని,అందరు టీచర్లు ఆస్తులు వెల్లడించాలని టీచర్లను అవమాన పరిచేలా సెర్క్యులర్ ప్రభుత్వం జారీ చేయటాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఉద్యోగి తప్పు చేస్తే అతని మీద చర్యలు తీసుకోవాలి కానీ,ఉపాధ్యాయులు తమ సమస్యల మీద ఎక్కడ ఉద్యమిస్తారోనని వారిని భయబ్రాంతులకు గురి చేయటం నేను ఎక్కడా చూడలేదన్నారు.
ఉపాధ్యాయులు ఆస్తులు కొనాలన్నా అమ్మలన్నా అనుమతి తీసుకోవాలని చెప్పటాన్ని తప్పు పడుతూ,తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.మీ ఎమ్మెల్యేలు, మంత్రులు,వారి కుటుంబం ఆస్తులు,బినామీల మీద ఉన్న ఆస్తులు వెల్లడించాలని,మీ పార్టీకి 800 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి కదా,అవి ఎక్కడి నుంచి వచ్చాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు.







