అసంతృప్త నేతల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తన పంథా మార్చుకుందా.ఇన్నాళ్లుగా ఇష్టం లేని వాళ్లు పోతే పోతారన్నట్లుగా వ్యవహరించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు కొత్త రూట్లో తన కారు ప్రయాణాన్ని మొదలుపెట్టిందా.
అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి.
ఏళ్ల తరబడి పార్టీలో ఉండి అవకాశాలు రాక, అధినేత కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్న పలువురు నేతలను బుజ్జగించే పనిలో పడ్డారట.
ఈ క్రమంలో ఆ బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలకెత్తుకున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావుడి, విపక్షాల దూకుడుతో ఉన్న నేపథ్యంలో.సీనియర్ నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నట్లు అర్థమవుతోందనేది రాజకీయ విశ్లేషకుల భావన.
అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు కేటీఆర్.
దీనిలో భాగంగా ఎక్కడికక్కడ అసంతృప్త నేతలతో ప్రత్యేక మంతనాలు జరుపుతూ.అంతర్గత విభేదాలను చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారనే వాదన జోరుగా సాగుతోంది.
ఇంకా చెప్పాలంటే.అసంతృప్త నేతలను బుజ్జగించేందుకే కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారనే వాదనలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నేతల బలాబలాలపై ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ టీం ఇచ్చిన సర్వే రిపోర్టుల నేపథ్యంలోనే కేటీఆర్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.
తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించి.
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.ఆ తర్వాత జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి ఆయన వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉండటంతో జూపల్లి కమల తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో జూపల్లి నివాసానికి వెళ్లిన కేటీఆర్.
ప్రధానంగా కొల్లాపూర్ లో పార్టీ పరిస్థితి, గ్రూప్ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

గతంలో సీఎం కేసీఆర్ పాల్గొన్న సభకు సైతం గైర్హాజరైన జూపల్లి.నిజానికి మొన్నటీ కేటీఆర్ పర్యటనకు సైతం దూరంగానే ఉన్నారు.అయితే.
కేటీఆరే ప్రత్యేక చొరవతీసుకొని మరీ జూపల్లి ఇంటికెళ్లి చాయ్ పే చర్చలు చేయడం చర్చనీయాంశంగా మారింది.జూపల్లికి, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డికి మధ్య విబేధాల నేపథ్యంలో పార్టీ మారకుండా నిలువరించడంతో పాటు.
టీఆర్ఎస్ లో వర్గపోరుకు చెక్ పెట్టేందుకే కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తోంది.
టీఆర్ఎస్ పుట్టి 22 ఏళ్లు పూర్తైంది.
ఇన్నేళ్లలో ఇప్పటికి ఎంతో మంది నేతలు వెళ్లిపోయినప్పటికీ.బుజ్జగింపు యత్నాలు జరగడం మాత్రం దాదాపు అరుదనే చెప్పుకోవచ్చు.
త్వరలో ఇతర జిల్లాల్లోని అసంతృప్త నేతలనూ కేటీఆర్ కలుస్తారని వినికిడి.అయితే టీఆర్ఎస్ లో అల్టిమేట్ నిర్ణేత కేసీఆరే కాబట్టి కేటీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.