50 లక్షల పెట్టుబడితో 5 వేల కోట్ల సంపద పొందవచ్చా? ఎన్ని దశాబ్దాలకైనా ఇది సాధ్యమవుతుందా? ఈ ఘనత సోనియా గాంధీ కుటుంబానికి సాధ్యమైంది.5 వేల మంది వాటాదారుల డబ్బుతో ప్రారంభమైన నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని సోనియా కుంటుంబం వశం చేసుకుంది.ఈ వ్యవహారంలో భారీగా ఫ్రాడ్ జరిగిందనేది వాదన.9 ఏళ్ళుగా సాగుతున్న ఈ కేసులో ఇప్పటికి సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ విచారిస్తోంది.
నేషనల్ హెరాల్డ్ ఆస్తుల స్వాధీనం కేసులో నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణ మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విచారించింది.ఈ నెల 23న కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని కూడా విచారిస్తుంది.2013 నుంచి కొనసాగుతున్న ఈ కేసు అనేక మలుపులు తిరిగి…చివరికి కాంగ్రెస్ ముఖ్యనేతల విచారణ దశకు చేరుకుంది.అయితే మోడీ సర్కార్ కక్ష సాధింపులో భాగంగానే సోనియా, రాహుల్ లను కేసుల పేరుతో వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
రాహుల్ ను విచారిస్తున్న సందర్భంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.
స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగుతున్న రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ పేరుతో ఒక సంస్థను స్థాపిస్తే ఇందులో 5 వేల మంది వాటాదారులు పెట్టుబడి పెట్టారు.అప్పట్లో బ్రిటిష్ వారు కొంతకాలం నేషనల్ హెరాల్డ్ పత్రికను నిషేధించారు కూడా.స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక దశాబ్దాల పాటు పత్రిక నడిచింది.2008 నుంచి పూడ్చుకోలేని నష్టాల కారణంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడింది.ప్రస్తుతం ఆ సంస్థకు ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో 5 వేల కోట్ల విలువైనఆస్తులున్నాయి.ఇదిలా ఉంటే పత్రికను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ పార్టీ వడ్డీ లేకండా 90 కోట్ల రుణాన్ని ఇచ్చింది.
ఆ రుణాన్ని కూడా తీర్చలేని విధంగా నష్టాల్లో కూరుకుపోయింది పత్రిక.

2010లో సోనియా, రాహుల్ నేతృత్వంలో 50 లక్షల రూపాయల పెట్టుబడితో యంగ్ ఇండియన్ లిమిటెడ్ పేరుతో ఒక సంస్థ ఏర్పడింది.ఇందులో సోనియా, రాహుల్ కు 76 శాతం వాటాలుండగా…ఇతర కాంగ్రెస్ నేతలైన మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ లకు 24 శాతం వాటా ఉంది.అయితే నేషనల్ హెరాల్డ్ ఇవ్వాల్సిన 90 కోట్లను వసూలు చేసే బాధ్యత సోనియా ఆధ్వర్యంలో మొదలైన సంస్థకు అప్పగించారు.అప్పు తీర్చలేని పరిస్థితుల్లో నేషనల్ హెరాల్డ్ సంస్థ తన ఆస్తులను సోనియాగాంధీ స్థాపించిన యంగ్ ఇండియన్ లిమిటెడ్ కు రాసిచ్చింది.50 లక్షల పెట్టుబడికి 5 వేల కోట్ల ఆస్తులన్నమాట.ఇక్కడే పెద్ద గోల్ మాల్ జరిగిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి 2013లో ఫిర్యాదు చేశాడు.ఈ కేసులో ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ కూడా ఇంప్లీడ్ అయ్యారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో తన తండ్రి కూడా వాటాదారుడేనని, వాటాదారులకు తెలియకుండా, ఆమోదం తీసుకోకుండా ఆస్తుల్ని ఎలా బదలాయిస్తారని ప్రశ్నిస్తున్నారాయన.

ఈడీ ఈ కేసు మీద 2014 నుంచి దర్యాప్తు జరుపుతోంది.2015లో పాటియాలా హౌజ్ కోర్టు సో్నియా, రాహుల్ లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఈడీ దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతల విచారణకు పిలిచింది.
ముందు ముందు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.







