విశ్వనగరం హైదరాబాద్ లో మహిళలకు భద్రత లేదా? నగరంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, అత్యాచార యత్నాలు పంపిస్తున్న సంకేతాలు ఏంటి? మహానగరంలో పబ్ కల్చర్ పతనం దిశగా పయనిస్తోందా? పోలీసులు కూడా మహిళల భద్రతను గాలికొదిలేశారా?.
హైదరాబాద్ మహానగరంలో పబ్ కల్చర్ మొదలై చాలా కాలమైంది.
కాని ఇప్పటి మాదిరిగా మహిళల మీద అత్యాచారాలు, వేధింపులు, అసభ్యంగా ప్రవర్తించడాలు పబ్ ల్లో జరిగినట్లు గతంలో వార్తలు రాలేదు.కొంతకాలంగా పబ్ ల్లో విచ్చలవిడి తనం పెరిగిపోయింది.
లోపల ఏం జరుగుతుందో బయటకు తెలిసే అవకాశమే లేదు.మద్యం, డ్రగ్స్ మత్తులో యువత నిండా మునిగిపోతోంది.
దీంతో ఏం చేస్తున్నారో తెలియని మైకం వారిని కమ్మేస్తోంది.అవకాశం కోసం చూసే కొందరు తమలోని పైశాచికత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు.
దిగజారిపోతున్న పబ్ కల్చర్ ఓ వైపున కొనసాగుతుంటే…మరోవైపు మహిళలపై అత్యాచార ఘటనలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.విశ్వనగరంలో పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు బాలికలపై గ్యాంగ్ రేప్ ఘటనలు సంచలనం రేపాయి.
అమ్నీషియా పబ్ ఘటన మరవక ముందే పాతబస్తీలో ఓ ఘటన, కార్ఖానాలో జరిగిన మరో ఘటనలోనూ మైనర్ బాలికలే బాధితులు.మద్యం తోపాటు పబ్ ల్లో డ్రగ్స్ కూడా అందుబాటులోకి రావడంతో ధనికవర్గాలకు చెందిన యూత్, అలాగే ఎగువ మధ్యతరగతి పిల్లలు కూడా విపరీతమైన కల్చర్ అలవాటు చేసుకుంటున్నారు.18 ఏళ్లలోపు వారికి పబ్ ల్లో ప్రవేశం లేదు.తమ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఉన్న పబ్ లు ఇవేమీ పట్టించుకోకుండా అందరినీ అనుమతిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్న రక్షక భటులు కూడా సకాలంలో స్పందించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ చేస్తే ఎక్కువ సార్లు పోలీసుల నుంచి స్పందన ఉండదని…ఒకవేళ స్పందించినా చాలా దురుసుగా మాట్లాడతారని చెబుతున్నారు.అసలు ఫోన్ ఎందుకు చేశామా అనుకునేలా పోలీసుల ప్రవర్తన ఉంటోందనే ఫిర్యాదులున్నాయి.పోలీసుస్టేషన్ కు లాయర్ తోనో, మహిళా కార్యకర్తలతోనో కలిసి వెళితేనే సరిగా స్పందిస్తున్నారు.ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.పోలీసుల ప్రవర్తనతో విసిగిపోతున్న మహిళలు వేధింపులను మౌనంగా భరిస్తున్నారే గాని ఫిర్యాదులు చేయడానికి సాహసించడంలేదు.








