యాదాద్రి జిల్లా:భువనగిరి పట్టణంలో సోమవారం 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బొమ్మాయిపల్లి 11వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పురపాలిక పరిపాలన రాష్ట్ర కమిషనర్ మరియు సంచాలకులు సత్యనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా భువనగిరి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు పడిగెల రేణుక ప్రదీప్,ఈరపాక నరసింహ,కైరంకొండ వెంకటేష్ పట్టణంలో పలు సమస్యలపై సిడిఏంఎకి వినతి పత్రం సమర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ భువనగిరి పురపాలక సంఘంలో డిప్యుటేషన్ మీద వెళ్ళిన ఉద్యోగస్తులను యధాస్థానంలో ఉద్యోగాలు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.గతంలో 3వ విడత పట్టణ ప్రగతి సందర్భంగా స్వయంగా మీరే రాయగిరిలో స్మశాన వాటికను అభివృద్ధి పరచుటకు కొరకు శంకుస్థాపన చేసిన పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
అట్టి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశ్యం పట్టణంలో గల ఎస్సీ ప్రాంతాలు మరియు స్లమ్ ఏరియాలో ఎస్సీ,ఎస్టీ (రిజర్వేషన్) వార్డులను అభివృద్ధి పరచాలని,కానీ,ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కేవలం అధికార పార్టీకి చెందిన ఒక్క ఎస్సీ రిజర్వేషన్ వార్డుకే నలభై నుండి యాభై లక్షల నిధులు కేటాయిస్తూ పట్టణంలో మిగిలి ఉన్న ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ వార్డులను మరియు ఎస్సి ప్రాంతాలు,స్లమ్ ఏరియాలను నేటికీ పట్టణ ప్రగతి నిధులు కేటాయించకుండా అభివృద్ధికి ఆమడ దూరం చేస్తున్నారని ఆరోపించారు.
ఎస్సీ రిజర్వేషన్ వార్డులను,స్లమ్ ఏరియాలను అభివృద్ధి పరుచుటకు వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ శాఖ నుండి 14వ ఫైనాన్స్-15వ ఫైనాన్స్ పట్టణ ప్రగతి ఫండ్స్ నుండి పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కొరకు సుమారు 8.70 కోట్ల రూపాయలను తీసుకున్న నిధులను వెంటనే మున్సిపల్ శాఖకు కేటాయించి పట్టణంలో ఉన్న 35 వార్డులను అభివృద్ధి చేయుటకు నిధులను కేటాయించాలని కోరారు.దీనికి స్పందించిన సిడిఎంఎ సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు నాలుగు రోజులలో రాష్ట్రంలో ఉన్న జిల్లా కలెక్టర్ అకౌంట్ లోకి ప్రత్యేక నిధులను మంజూరు చేస్తోందని,ఆ నిధులతో భువనగిరి పురపాలిక సంఘం అభివృద్ధి కొరకు నిధులను కేటాయించుకుని పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతికి తెలిపారు.







