ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కీలకంగా మారారు.గత ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేయగా ఒక్కచోట కూడా గెలవలేకపోయారు.
దీంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశాన్నిపవన్ కళ్యాణ్ కోల్పోయారు.కానీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుస్తానన్న ధీమా ఆయనలో కనిపిస్తోంది.
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వేసినా పవన్ సమాధానం ఇచ్చే తీరు ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని చాటుతోంది.
అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది.2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు.పోయిన చోటే వెతుక్కోవాలనే లాజిక్‌తో మళ్లీ ఆ రెండు స్థానాల్లోనే ఆయన పోటీ చేస్తారని.
ఒకవేళ వేరే చోట నుంచి బరిలో దిగినా ఓటమి భయంతోనే నియోజకవర్గం మార్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన నేతలు భావిస్తున్నారు.ఇప్పటికైతే ఏ నిర్ణయం తీసుకోలేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నా ఓ నిర్ణయానికి అయితే వచ్చి ఉంటారన్న టాక్ నడుస్తోంది.
తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తామని అంటున్న వైసీపీ వాళ్లకే ముందు సమాచారం ఇస్తానని పవన్ కౌంటర్ ఇవ్వడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.ప్రస్తుతానికి ఆయన ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలలో గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, తిరుపతి ఉన్నాయని ప్రచారం గట్టిగా సాగుతోంది.
మరోవైపు పవన్ ఏం చేసినా వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండటం పట్ల వాళ్లల్లో పవన్ కళ్యాణ్ అంటే ఎంత భయం ఉందో చాటి చెప్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్న విషయాలు కూడా జగన్‌ను అడిగి పవన్ కళ్యాణ్ చేయాలి అన్నట్లు వైసీపీ నేతలు ప్రవర్తిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది.పైగా జనసేన ఏం చేసినా దానిని టీడీపీతో లింకు పెట్టడం కూడా మంచిది కాదనే భావన పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది.