టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ పదవుల పంపకం పూర్తయ్యింది.ఆ పార్టీ నుంచి ఎందరో ఆశావాహులు రాజ్యసభ సీట్ల కోసం పోటీపడ్డారు.
అయితే హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రకు మాత్రమే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు.ఈ నేపథ్యంలో రాజ్యసభ పదవులపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా నడుస్తోంది.
టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ పదవి ఆశించిన వారిలో ఉమ్మం ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉన్నారు.ఆయన అనూహ్యంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2014 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎంపీగా విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీలో తలపండిన రేణుకా చౌదరితో పాటు టీడీపీ నుంచి అప్పట్లో చక్రం తిప్పిన నామా నాగేశ్వరరావును పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఓడించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
పొంగులేటి ఎంపీగా గెలిచింది వైసీపీ నుంచి అయినా.
తెలంగాణ రాజకీయాల నుంచి వైసీపీ అవుట్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.అయితే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావుతో విభేదాలు రావడం కారణంగా పార్టీ అధిష్టానం పొంగులేటిని దూరంగా ఉంచింది.
2018 ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు కోసం తన ఎంపీ పదవిని వదులుకున్న పొంగులేటికి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది.అయితే ప్రస్తుతం రాజ్యసభ సీటు కూడా దక్కకపోవడంతో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సీటు ఇస్తానంటే పొంగులేటి తిరస్కరించారని తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముందే చెప్పారని.అందుకే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో టీఆర్ఎస్ నాయకత్వం ఆయన పేరును పరిశీలనలోకి తీసుకొలేదని చర్చ జరుగుతోంది.

ఇప్పుడు రాజ్యసభ సీటు తీసుకుంటే వచ్చే లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ అడగడం వీలుకాదనే ఉద్దేశంతోనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజ్యసభ సీటు విషయంలో ఆసక్తి చూపించలేదని ప్రచారం జరుగుతోంది.మొత్తానికి ప్రజా క్షేత్రంలోనే అమీ తుమీ తేల్చుకోవాలని పొంగులేటి నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
.






