అమెరికా కల నెరవేర్చుకునే ప్రస్థానంలో చివరి మజిలీ గ్రీన్ కార్డు.హెచ్ 1 బీ సహా ఇతర వీసాల సాయంతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వలసదారులకు గ్రీన్ కార్డు వస్తే ఇక జీవితంలో ఎలాంటి చీకూ చింతా వుండదు.అయితే అది అనుకున్నంత తేలిక కాదు.ఎందుకంటే అమెరికాకు వచ్చే వలసల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది.దీంతో గ్రీన్ కార్డుల కేటాయింపు ఆ దేశ ప్రభుత్వానికి కత్తిమీద సాములా తయారైంది.ఇతర దేశాల సంగతి పక్కనబెడితే.
గ్రీన్ కార్డుల కోసం ఎక్కువగా పడిగాపులు కాస్తోంది భారతీయులే.తీవ్రమైన పోటీ నేపథ్యంలో కొన్నేళ్లుగా గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి.
దీంతో భారతీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై పలుమార్లు నిరసనలు సైతం చేశారు.
ఇలాంటి వారందరికీ శుభవార్త.గ్రీన్‌కార్డు దరఖాస్తులను ఆరు నెల్లలోపు ప్రాసెస్ చేయాలనే సిఫారసును అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమీషన్ ఆమోదించింది.గ్రీన్‌కార్డుల ప్రాసెస్‌కు సంబంధించిన ఈ ప్రతిపాదనను ఇండో అమెరికన్ కమ్యూనిటీ నేత, ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయిన్స్, పసిఫిక్ ద్వీపవాసులపై నియమించిన కమీషన్‌లో సభ్యుడైన అజయ్ జైన్ భుటోరియా ఇటీవల జరిగిన సమావేశంలో తెరపైకి తీసుకొచ్చారు.దీనిపై చర్చ అనంతరం కమీషన్‌లోని 25 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ క్రమంలోనే గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించేందుకు గాను వాటిని మరోసారి సమీక్షించాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)కు కమీషన్ సూచించింది.ఆగస్టు 2022 నుంచి అదనపు సిబ్బందిని నియమించుకుని మూడు నెలల్లోగా 100 శాతం ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని కమీషన్ సూచించింది.
అలాగే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 32,439 ఇంటర్వ్యూలు, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని వచ్చే ఏడాది ఇదే సమయానికి 150 శాతం పెంచాలని స్పష్టం చేసింది.అప్పటి నుంచి గ్రీన్‌కార్డుల ఇంటర్వ్యూ, వీసా ప్రాసెసింగ్ కాలవ్యవధి ఆరు నెలలు వుండేలా చూసుకోవాలని కమీషన్ సూచించింది.

ఇకపోతే.గ్రీన్‌కార్డు కేటాయించేందుకు గాను అమెరికా ‘కోటా సిస్టమ్’ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.దీని ప్రకారం.ప్రతి దేశానికి 7 శాతం చొప్పున గ్రీన్‌కార్డులు జారీ చేస్తూ వస్తోంది అగ్రరాజ్యం.ఈ విధానంలో తక్కువ జనాభా వున్న దేశాలకు ఎక్కువగా గ్రీన్ కార్డులు మంజూరవుతుండగా.భారత్, చైనా వంటి పెద్ద దేశాలకు ఏడు శాతం నిబంధన ప్రకారం కేటాయించే గ్రీన్‌కార్డులు ఏ మూలకు సరిపోవడం లేదు.
దీంతో ఎంతోమంది భారతీయులు బ్యాక్‌లాగ్‌లో వుండిపోతున్నారు.వీసా గడువు ముగుస్తుండటంతో కొందరు అమెరికాను వీడి వారి స్వదేశాలకు వచ్చేయాలని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అడ్వైజరీ కమీషన్ సిఫారసును అమలు చేస్తే గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుల కల నెరవేరనుంది.కమీషన్ తీర్మానాన్ని అధ్యక్షుడి ఆమోదం కోసం వైట్‌హౌస్‌కు పంపనున్నారు.