యాదాద్రి జిల్లా:గత మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు వచ్చిందని భువనగిరి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ ప్రశ్నించారు.గురువారం భువనగిరి పట్టణంలోని 27వ,వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నజీమా,కాంగ్రేస్ నేతలు నస్రీన్,సలావుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు సభకు వారు ముఖ్యాతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జలీల్ పుర,బీచ్ మెహాల్ల,శంకరయ్య హోటల్,పెద్దవాడకట్టు ఏరియాలో పర్యటించారు.అనంతరం వారు మాట్లాడుతూ భువనగిరి మున్సిపల్ ఎన్నికల సమయంలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని దుయ్యబట్టారు.
మున్సిపల్ ఎన్నికల్లో జలీల్ పుర ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే ఎన్నో ఏళ్లుగా వృత్తి రీత్యా మాంసం వ్యాపారం చేసుకునే ముస్లిం సోదరులకు నూతన పద్ధతిలో ప్రభుత్వం తరఫున ప్లాటర్ హౌస్ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారని,అలాగే పాత ఇనుప సామాను వ్యాపారం చేసుకునే వారికి ఊరి చివరలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఇచ్చి,ప్రభుత్వ రుణాలు ఇప్పించి వ్యాపారాలను ప్రోత్సహిస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.ముస్లిం సోదరుల ఇళ్లలో ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు,నలుగురు పిల్లలతో పెద్దపెద్ద కుటుంబాలు ఉన్నాయని,వారికి వివాహాలు జరిగినా వారికి నేటికీ రేషన్ కార్డులు రాక,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు లేక,నీళ్ల వసతుల లేమితో వారు పడుతున్న బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు.
వయో వృద్ధులు,భర్తలు చనిపోయిన వితంతువులకు నేటికీ ఆసరా పెన్షన్లు రాకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కనిపించడం లేదా అన్నారు.వారి పరిస్థితి చూస్తుంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
జలీల్ పుర 27వ వార్డు అభివృద్ధికి వెనువెంటనే 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్,ఈరపాక నరసింహ,కైరం కొండ వెంకటేష్, వడిచర్ల లక్ష్మీ కృష్ణ యాదవ్,వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమీర్,బురాన్,అమీర్,హజర్,కాంగ్రెస్ నాయకులు గుర్రాల శ్రీనివాస్,కాల్య నాగరాజు, సిరిపంగ చందు,అందే నరేష్,దర్గాయి దేవేందర్, ముత్యాల మనోజ్,కొల్లూరి రాజు,భీమయ్య తదితరులు పాల్గొన్నారు.