ఆత్మకూర్(ఎస్)లో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్(ఎస్)మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా పోతున్న ఇళ్లను కూల్చేందుకు భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు జేసీబీలతో గ్రామానికి చేరుకున్నారు.

బాధిత కుటుంబాలకు చెందిన వారు వారిని అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

రోడ్డు విస్తరణలో ఇళ్ళు కోల్పోతున్న బాధితులకు హామీ ఇవ్వడానికి కానీ,సంబంధిత అధికారులతో బాధితుల తరపున మాట్లాడడానికి కానీ,స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు ఒక్కరు కూడా సంఘటన స్థలానికి రాకపోవడం గమనార్హం.అక్కడ జరుగుతున్న దృశ్యాలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తుండగా పోలీసులు వారి మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం, కొందరిని అరెస్టు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కొందరు బాధితులు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో కోల్పోతున్న ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించకుండా, ఎలాంటి హామీ ఇవ్వకుండా ఇళ్ళు కూల్చివేస్తే తాము ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నఫలంగా ఇళ్లను కూల్చివేస్తే ఎర్రటి ఎండల్లో పసి పిల్లలతో,వృద్ధులతో ఎక్కడ ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నష్టపరిహారం చెల్లించకుండా, కనీసం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకోడానికి కొంత సమయం ఇవ్వకుండా పోలీసులతో దౌర్జన్యంగా కూలగొట్టడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

Latest Suryapet News