నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండల కేంద్రంలో గల నిర్మలమ్మ చెరువుకు చేపల కాంట్రాక్టర్ల రూపంలో చేటు వచ్చిపడింది.వివరాల్లోకి వెళితే కేతేపల్లి నిర్మలమ్మ చెరువును గతేడాది మత్స్యశాఖ అధికారులు వేలం వేశారు.కొంతమంది స్థానికులు రూ.1.81లక్షలకు వేలంలో చేపల కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.వీరికున్న కాంట్రాక్ట్ గడువు జూన్ 30,2022 వరకు ముగుస్తుంది.
గత మూడేళ్లుగా చెరువు నీళ్లతో నిండు కుండలా మారటంతో వారికి చేపలు పట్టడానికి వీలు కాలేదు.దీనితో ఏమి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన చేపల కాంట్రాక్టర్లు స్వయంగా రంగంలోకి దిగారు.
చెరువు చుట్టూ 2 ఇంచుల పైపులతో మోటర్లు పెట్టి,మరికొన్ని చోట్ల గాలి పైపులతో నీటిని అలుగు ప్రాంతం నుండి బయటకు పంపుతుండడంతో చెరువులో నీరు ఖాళీ అవుతుంది.చేపల కోసం చెరువులో నీటిని బయటికి వదిలేస్తే చేరువుపై ఆధారపడిన రైతులు, పశుపక్ష్యాదుల పరిస్థితి ఏమిటని గ్రామస్తులు వాపోతున్నారు.
చేపలు పట్టడానికి ఇతర అధునాతన పద్ధతులు పాటించాలి కానీ,ఇష్టానుసారం చెరువులో నీటిని తోడేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒకపక్క ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులు నింపుతూ ఉంటే, మరోపక్క చేపల పేరుతో నీటిని అనధికారికంగా తోడేస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరో 45 రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుందని,రైతులు పంటలు పండించుకోవడానికి చెరువులో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ప్రభుత్వ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి,అక్రమంగా చేస్తున్న నీటి విడుదలను అరికట్టాలని,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.