ఏపీ రాజకీయాలు పొత్తులతో పాత పార్టీలు దూకుడు పెంచాలని చూస్తుంటే కొత్త పార్టీలు కూడా తెరపైకి వస్తున్నాయి.ఎవరికి వారు తమ వ్యూహాలతో ఎన్నికల రాణానికి సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.జగన్ అధికారంలోకి రావడానికి దళిత, క్రిస్టియన్ లు చాలా కీలకంగా పనిచేశారని అందుకు తానే కారణం అన్న బ్రదర్ అనిల్, జగన్ అధికారంలోకి రాగానే క్రిస్టియన్, దళిత బీసీ వర్గాలను మోసం చేశారని విమర్శిస్తున్నారు.
అందుకే వారి కోసం పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు.తనకు సీఎం అయ్యే ఆలోచన లేదని మోసపోయిన దళిత క్రిస్టియన్ లాంటి వెనుక బడిన వర్గాలకు అండగా మాత్రం ఉంటానని చెబుతున్నారు.
కొంతకాలంగా స్తబ్దంగా ఉన్నప్పటికీ త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన బ్రదర్ అనిల్ అనిల్ నుంచి వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అని చెప్పేస్థాయికి ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం దక్షిణాది పైనా దృష్టిసారిస్తున్నది.
రాజకీయ శూన్యత కనిపిస్తున్న ఏపీ లాంటి రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.రాష్ట్రానికి కొత్త ఇన్‌చార్జిగా మణి నాయుడును నియమించారు.ఇప్పటికే ఇక్కడి నాయకులతో రహస్య మీటింగ్స్ కూడా ఆప్ మొదలుపెట్టింది.వెంటనే కాకున్నా లాంగ్ టర్మ్ ప్లాన్‌తోనే కేజ్రీవాల్ ఇక్కడ ఆమ్ ఆద్మీని బలోపేతం చేయాలని చూస్తున్నారు.2024 ఎన్నికల్లో అరంగేట్రం చేసేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటున్నది.ఆంధ్ర ఆక్టోపస్‌గా పిలుచుకునే లగడపాటి రాజ్‌గోపాల్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ఇటీవల ఆయన కదలికలు చూస్తుంటే మళ్లీ రాజకీయాల వైపు ఆకర్షితులు అవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.రెండు రోజుల క్రితం ఓ వేడుకలో వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ తదితరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
వైసీపీ విజయవాడ ఎంపీ స్థానానికి సరైన అభ్యర్థి కావాలని దాన్ని భర్తీ చేయడానికి లగడపాటి సరైన వ్యక్తి అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.రానున్న రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే దిశగా లగడపాటి ఆలోచనలుంటాయని తెలుస్తున్నది.

రాజకీయ వ్యూహ కర్త ఇమేజ్ ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారు.ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్‌తో సమాలోచనలు జరిపిన ఆయన, భవిష్యత్ మెరుగుపడాలంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని, రాష్ట్రంలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటే మంచిది అని అధిష్టానానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని సమాచారం.తాను ఎదురించి బయటకు వచ్చి సొంతంగా గెలిచిన జగన్‌కు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లుంటున్నారు.రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారితోనే ముందుకు వెళతామని వైసీపీ కీలక నేత విజయ సాయిరెడ్డి అనడం చూస్తుంటే భవిష్యత్‌లో ఏదైనా జరగొచ్చనే ఊహాగానాలు బలపడుతున్నాయి.
ఎన్ని సీట్లు గెలిచినప్పటికీ 5 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వానికైనా ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత తప్పదు.రాష్ట్రంలోనూ కాస్త్ర తీవ్రస్థాయిలోనే ఉందని తెలుస్తున్నది.వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోకూడదని జనసేన అధినేత పవన్ భావిస్తున్నారు.కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్న బీజేపీ, టీడీపీలను సైతం ఒక తాటిపైకి తేవాలని, విపక్షాలన్నీ కలిసి కట్టుగా జగన్‌ను ఎదుర్కోవాలని పదేపదే చెబుతున్నారు.
దేశంలో మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం ఎన్నికల హడావిడి రెండేళ్ల ముందే మొదలైనట్లుంది.







