దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ అడుగులు ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారాయి.త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉండడం తో, ఇప్పటి వరకు ఆయన సేవలను పొందుతున్న, పొందాలని చూస్తున్న అనేక ప్రాంతీయ పార్టీల పరిస్థితి అయోమయంగా మారింది.
ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నారు.
ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ వైపు తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల విషయంలో సందిగ్ధత నెలకొంది.
ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ విషయంలో ఇది మరింత ఎక్కువైంది.ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టిఆర్ఎస్ కు రాజకీయ వ్యూహకర్త గా పనిచేస్తున్నారు.
ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం రంగంలోకి దిగింది .నియోజకవర్గాల వారీగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ? క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ? టిఆర్ఎస్ కు మరో సారి అధికారం దక్కాలి అంటే ఏం చేయాలి ? ఏ నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా పోటీకి దింపితే రాబోయే ఎన్నికల్లో గెలుస్తారు అనే అనేక విషయాలపై ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు నివేదికలను కేసీఆర్ కు అందిస్తున్నారు.
అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరితే ఆయన సేవలను వినియోగించుకోవాలా లేదా అనే విషయం లోనే క్లారిటీ కి రాలేకపోతున్నారు.ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అంటూ తెలంగాణ బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఈ సమయంలో కాంగ్రెస్ లో చేరబోతున్న ప్రశాంత్ కిషోర్ సేవలను ఇంకా కొనసాగిస్తే.బీజేపీ చేసిన విమర్శలు నిజమే అన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్ళుతుంది అనే భయం టిఆర్ఎస్ నేతలకు ఉంది.
దీంతో ప్రశాంత్ కిషోర్ శిష్యుడు సునీల్ కానుగోలు సేవలను ఉపయోగించుకుంటారా అనే విషయంలో క్లారిటీ లేదు .ఎందుకంటే ఎప్పటికీ సునీల్ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు వ్యూహకర్తగా పని చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ వ్యవహారం టిఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది.

అసలు తమకు ఏ రాజకీయ వ్యూహకర్త అవసరం లేదని రాజకీయ ఉద్దందుడి గా ఉన్న కేసీఆర్ వ్యూహాలు సరిపోతాయి అని, టీఆర్ఎస్ ఆవిర్భావం.ప్రత్యేక తెలంగాణ సాధన, పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత ఇవన్నీ కేసీఆర్ సొంతమని, ఆయనను మించిన వారు మరొకరు ఉండరు అని టిఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ సేవలు టిఆర్ఎస్ కు ఇక పై లేనట్టే.
కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య పొత్తు కుదిర్చే బాధ్యతను ప్రశాంత్ కిషోర్ తీసుకుంటున్నారు.అలా కుదరని పక్షంలో టిఆర్ఎస్ కు ఆయన ‘ హ్యాండ్ ‘ ఇచ్చే అవకాశం లేకపోలేదు.







