రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం వల్ల మరోసారి రైతులకు భరోసా కల్పించారు.వడ్ల కొనుగోలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తక్కువ ధరకు వడ్లను అమ్మవద్దని, క్వింటాలుకు ఒక వెయ్యి 9 వందల 60 రూపాయిలకి కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడంతో రైతుల్లో మరింత మనోధైర్యం పెరిగింది.
వికారాబాద్ జిల్లా పరిధిలో యాసంగిలో 29,200 మంది రైతులు సుమారు 45,690 ఎకరాల్లో వరి సాగు చేశారు.
ఇందులో సన్న, దొడ్డు రకాలు ఉన్నాయి.జిల్లాలో 12వేల పైచిలుకు ఎకరాల్లో సన్న రకాలు, 33వేల పైచిలుకు ఎకరాల్లో దొడ్డు రకాల వరి సాగైంది.
దీంతో సన్న రకాలు 15వేల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకాలు లక్షా 3వేల మెట్రిక్ టన్నులు, మొత్తం లక్షా 18వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో ఏప్రిల్ మూడో వారం నుంచి వరి కోతలు ప్రారంభమవుతాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో కోతల కంటే ముందే వందకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం చెప్పినందున వరి వద్దని సీఎం సూచించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి వేయండి కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని ప్రకటించి, తీరా పంట చేతికి వచ్చిన సమయంలో కేంద్రం ముఖం చాటేయడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు.

రైతులకు న్యాయం చేయాలంటూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేయడంతోపాటు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టి వడ్లు కొనుగోలుపై కేంద్రానికి 24 గంటలు డెడ్‌లైన్ విధించారు.కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మంగళవారం ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించి రైతులు నష్టపోకుండా ఉండేందుకు వడ్ల కొనుగోలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో రైతు కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.మరోసారి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా తేలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.వడ్ల కొనుగోలుకు సంబంధించి రెండు మూడు రోజుల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పూర్తిస్థాయిలో స్పష్టత రానున్నది.
జిల్లావ్యాప్తంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నది తేలనున్నది.ఏదిఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నష్టం భరించి వడ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతులకు మేలు చేకూరనున్నది.

యాసంగి సీజన్‌లో వరి పండించిన రైతులను ఆదుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.ఈ మేరకు రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.అయితే రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో నిరసన, జాతీయ రహదారుల దిగ్బంధం, రాస్తారోకో, గ్రామాల్లో రైతుల ఇండ్లపై నల్లజెండాల ప్రదర్శన, ఢిల్లీలో ధర్నా తదితర కార్యక్రమాలను చేపట్టినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే రైతు నుంచి వడ్లను సేకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి మరోసారి రైతు ప్రభుత్వంగా నిలిచింది.

అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.ఏయే గ్రామాల్లో అధిక మొత్తంలో వరి సాగవుతుందనే వివరాలను బట్టి ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.అయితే యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినప్పటికీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు.అయితే రైతులెవరూ తక్కువ ధరకు ఇతరులకు విక్రయించకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వం సూచించింది.
మరోవైపు వడ్లను రైతుల నుంచి క్వింటాలుకు ఒక వెయ్యి 9 వందల 60 రూపాయిల మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయనున్నారు.రైతుల ఖాతాల్లోనే డబ్బులను జమ చేయనున్నారు.







