సీఎం కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయ స్కెచ్ లు సిద్దం చేస్తున్నారు.వారం రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న సీఎం.
జాతీయ రాజకీయాల్లో భవిష్యత్ పాత్ర పైన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ధాన్యంతో మొదలైన కేంద్రం పైన పోరాటం ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ – కాంగ్రెస్ వ్యతిరేక వేదికగా కొనసాగుతోంది.
అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేసే విధంగా సీఎం తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.అందులో భాగంగా.
వారం రోజులుగా రాష్ట్ర స్థాయిలో కొనసాగిస్తున్న నిరసనలు ఇప్పుడు ఢిల్లీకి చేరాయి.
ఢిల్లీ కేంద్రంగా పోరాటాలు యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలనే డిమాండ్‌తో ఇవాళ ఢిల్లీలో టీఆర్‌ఎస్ చేపట్టే ధర్నాలో కేసీఆర్ పాల్గొనేదీ లేనిదీ ఇంకా తెలియనప్పటికీ రేపు సీఎం రాష్ట్రానికి చేరుకుంటారు.
త్వరలోనే కేసీఆర్ పలు పార్టీల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఢిల్లీ లేదా హైదరాబాద్ వేదికగా నిర్వహించే ఈ సమావేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఆహ్వానం పలకనున్నారు.
ఈ సమావేశం పైన తాజాగా కేసీఆర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ చర్చించినట్లు సమాచారం.ఇప్పటికే మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌తో సమావేశమైన కేసీఆర్ జాతీయ రాజకీయాలపైన చర్చించారు.
తెలంగాణలో కేటీఆర్ పాలనా వ్యవహారాల్లో కీలకంగా మారటంతో.జాతీయ రాజకీయాల్లో కవితకు కేసీఆర్ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
సమాజ్‌వాద్ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో సంప్రదింపుల బాధ్యతను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేసీఆర్ తాజాగా అప్పగించారు.రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బిహార్ విపక్ష నేత తేజస్వీ యాదవ్ స్వయంగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సమావేశమయ్యారు.ఇక, కేసీఆర్ జాతీయ రాజకీయాల అజెండాతో అనేక రాష్ట్రాల్లో పర్యటించారు.ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.ఆ సమయాల్లోనూ కవిత సీఎం వెంటే ఉన్నారు.మరోవైపు కేసీఆర్‌తోపాటు వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కవిత తన బృందంతో కలిసి జాతీయస్థాయి మీడియా సంస్థల అధినేతలు, ఎడిటర్లతో వరుస భేటీలు జరుపుతున్నారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తన వాయిస్ బలంగా వినిపించాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు.దీని కోసం ఒక సీనియర్ జర్నలిస్టును రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పనిచేసేలా ప్రజాసంబంధాల అధికారిగా నియమించింది.
ఇవాళ ఢిల్లీ కేంద్రంగా టీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో కేంద్రం తీరు పైన నిరసన కార్యక్రమం నిర్వహించనుంది.12న మంత్రివర్గ సమావేశంలో కేంద్రం పైన పోరాటానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.ఢిల్లీ టూర్ తర్వాత మళ్లీ టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు అంశంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.దీంతో.కేసీఆర్ ఇటు తెలంగాణ .అటు జాతీయ రాజకీయాల్లో కీలకంగా తన అడుగులు పక్కా వ్యూహాత్మకంగా వేస్తున్నట్లు కనిపిస్తోంది.ఇదే సమయంలో ఇటు రాష్ట్రంలో కేటీఆర్.అటు జాతీయ రాజకీయాల్లో కవిత కు ప్రాధాన్యత పెరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పుడు ఇవన్నీ.రాజకీయంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి.