సూర్యాపేట జిల్లా:ఇంటి స్థలం ఒక్కటే పట్టాదారులు మాత్రం ఇద్దరు లేదా ముగ్గురు.ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎవరో అధికారులకే తెలియకపోవడం విచిత్రం.
ఒక్క ప్లాట్ ను ఇద్దరికి,ముగ్గురికి కట్టబెట్టిన అధికారులు.లబ్ధిదారులకు ఇచ్చిన చాలా పట్టాలలో రెవిన్యూ అధికారుల సంతకం లేదు.
రెవిన్యూ కార్యాలయ ముద్ర లేని పట్టాలు పదుల సంఖ్యలో లభ్యం.అసలు ఒరిజినల్ పట్టాలు ఎక్కడున్నాయో తెలియని వైనం.
అయోమయంలో లబ్ధిదారులు,తలలు పట్టుకుంటున్న అధికారులు.ఇది సూర్యాపేట జిల్లాలో గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో నెలకొన్న అక్రమాల చిట్టా.
వివరాల్లోకి వెళితే… అనంతగిరి మండలం వెంకట్రామాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నాటి కాంగ్రేస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పేరుతో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు.నాటి నుండి నేటి వరకు ఆ ఇందిరమ్మ ఇళ్ల స్థలాలలో అసలైన లబ్ధిదారులు ఎవరనేది అందరికీ అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది.
ఈ స్థలాల విషయంలో 2013 నుండి అనేక వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.అనేకమంది బాధితులు తమకు జరిగిన అన్యాయంపై తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
కానీ, ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఇందిరమ్మ ఇళ్ల స్థలాల వ్యవహారం మిగిలిపోయింది.దాదాపు 9ఏళ్ళు అయినా ఇప్పటి వరకు చాలామందికి ఒరిజినల్ పట్టాలు ఇవ్వలేదు.
పైగా ఆ పట్టాలు అధికారుల వద్ద కూడా లేవని అంటున్నారు.లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారుల వద్ద లేకుండా పట్టాలు ఎక్కడ ఉన్నాయి? ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి ఎవరనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రధాన అంశంగా మారింది.ఒకరు 9 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిలోకి మరొకరు వచ్చి ఇది నా ప్లాటు అంటూ గొడవకు దిగడంతో విషయం మీడియా దృష్టికి చేరింది.వెంకట్రామాపురం గ్రామ ఇందిరమ్మ కాలనీలో గత కొన్ని రోజులుగా ఇళ్ల స్థలాల గురించి వివిధ పత్రికల్లో సమగ్ర సర్వే చేయాలని వార్తలు రావడంతో ఎట్టకేలకు రెవెన్యూ అధికారులకు విషయం నషాలానికి ఎక్కి శుక్రవారం డోర్ టు డోర్ సర్వే చేపట్టారు.
బాధితుల ఫిర్యాదులు,పత్రికల్లో వరుస కథనాలు రెవెన్యూ అధికారుల్లో చలనం తెచ్చింది.సమస్య జఠిలం అవుతున్న కారణంగా ఇందిరమ్మ కాలనీలో డోర్ టు డోర్ సర్వే చేపట్టారు.ఈ సర్వేతో ఇందులో నెలకొన్న అసలు సమస్యలు,అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.ఈ నేపథ్యంలో అసలు కాలనీలో ప్లాట్లు ఎవరివి?ఇండ్లలో ఉండేది ఎవరు?అసలైన లబ్ధిదారులు ఎవరు?బినామీలు ఎవరు?అనే కోణంలో సర్వే చేపట్టారు.అధికారులు సర్వే చేస్తున్న సమయంలో లబ్ధిదారుల నుండి అనేక కీలక అంశాలు బయటపడడంతో ఇందిరమ్మ ఇళ్లలో చోటుచేసుకున్న అక్రమాలు వెలుగు చూశాయి.సర్వే సందర్భంగా లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలకు ఆమోదించబడిన ఫ్లాట్ నెంబర్ కానీ,రెవెన్యూ కార్యాలయం ముద్ర కానీ లేకుండా దర్శనమిచ్చాయి.
పైగా అందులో చాలా వరకు రెవెన్యూ అధికారుల సంతకాలు లేని పట్టాలు లబ్ధిదారుల నుండి బయటపడడంతో అధికారులతో పాటు లబ్ధిదారులు,గ్రామస్తులు కూడా అవాక్కయ్యారు.అంతేకాక లబ్ధిదారులకు ఒకే నెంబర్ తో ఇద్దరికి,ముగ్గురికి ప్లాట్ పట్టాలు మంజూరు అయినట్లు తెతెల్లం కావడంతో అధికారులు తెల్ల మొహం వేశారు.
ముగ్గురు లబ్ధిదారులు ఒకే నెంబర్ ఉన్న పట్టాలు చూపడంతో ఆ పట్టాలు చూసిన అధికారులకు దిమ్మదిరిగి పోయినంత పనైంది.ఇది చూసిన లబ్ధిదారులు అయోమయానికి గురయ్యారు.కూలీ పనులు చేసుకుంటేనే పూటగడవని తమ కుటుంబాలకు దొంగ పట్టాలు ఇచ్చి మోసం చేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు,స్థానికులు అధికారులను కోరారు.ఇదిలా ఉంటే ఇంటింటి సర్వేలో భాగంగా రెవెన్యూ అధికారులు చేస్తున్న సర్వే పలు అనుమానాలకు తావిస్తోందని ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
అసలు లబ్ధిదారుల లిస్టు లేకుండా అధికారులు సర్వే చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అధికారికంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో తెలియకుండా,అధికారుల దగ్గర సర్వేకి సంబంధించిన ఆధారాలు లేకుండా రెవిన్యూ అధికారులు నిర్వహిస్తున్న సర్వేపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కాలనీలో బుడిగ జంగాలను సైతం అక్రమార్కులు వదల్లేదు.ఉండడానికి ఇళ్ళు లేని నిరుపేదలకు,కూలీ పనులకు వెళ్లి పొద్దంత కష్టం చేసి ఇంటికి వచ్చిన వారికి తల దాచుకునేందుకు సొంతింటి కళ నెరవేర్చేందుకు ప్రభుత్వలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి నిజమైన లబ్ధిదారులకు అందకుండా అధికారులు,ప్రజా ప్రతినిధులు, దళారులు అక్రమాలకు పాల్పడుతూ వెనుకబడిన జాతుల,కులాల బ్రతుకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ఇంటి స్థలం నెంబర్ ని ఇద్దరికి,ముగ్గురికి ఇచ్చి అమాయక ప్రజల మధ్య గొడవలు పెడుతూ పేదల పొట్టకొడుతున్న అక్రమార్కులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.ఇంతటి క్లిష్టమైన సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి…?
.